Farm Laws: సాగుచట్టాల రద్దు.. అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఉద్యమం ఆగదు!

వ్యవసాయ చట్టాలను రద్దు చేసినట్లు అధికారిక ప్రకటన వచ్చే వరకూ తమ ఉద్యమం ఆగదని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు.

Updated : 22 Nov 2021 11:42 IST

భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించిన రైతు సంఘాలు

దిల్లీ: వ్యవసాయ చట్టాలను రద్దు చేసినట్లు అధికారిక ప్రకటన వచ్చే వరకూ తమ ఉద్యమం ఆగదని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. అంతేకాకుండా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, ఆందోళనల సందర్భంగా రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వాటిపై స్పష్టత వచ్చేవరకూ ఇప్పటికే తలపెట్టిన కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సంయుక్త కిసాన్‌ మోర్చా (SKM) ఆధ్వర్యంలో నేడు దిల్లీలో భేటీ అయిన వివిధ రైతు సంఘాల నేతలు.. నవంబర్‌ 27న మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

‘వ్యవసాయ చట్టాల రద్దు అంశంపై చర్చించాం. ఇందులో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో తలపెట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తాం. ముఖ్యంగా నవంబర్‌ 22న యూపీలో జరిగే మహాపంచాయత్‌, నవంబర్‌ 26న దిల్లీ సరిహద్దుల్లో నిరసనలతోపాటు నవంబర్‌ 29న తలపెట్టిన పార్లమెంట్‌ మార్చ్‌ను చేపడతాం’ అని రైతునేత బల్బార్‌ సింగ్‌ రాజేవాల్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, విద్యుత్‌ సవరణ బిల్లు రద్దు, రైతులపై కేసుల ఎత్తివేత వంటి డిమాండ్లను తెలియజేస్తూ ప్రధానమంత్రికి బహిరంగ లేఖ రాస్తామని వెల్లడించారు. ఇక రైతులపై నమోదైన కేసుల ఎత్తివేత, మరణించిన అన్నదాతలకు పరిహారం, లఖింపూర్‌ ఖేరీలో రైతులపై కారు దాడి వంటి ఘటనలను కూడా సమావేశంలో చర్చించామని బీకేయూ నేత రాకేశ్‌ టికాయిత్‌ వెల్లడించారు.

ఇదిలాఉంటే, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ నెల 29నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ చట్టాల రద్దుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం 24న జరిగే కేంద్ర కేబినెట్‌ భేటీలోనే వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించి తీర్మానం చేయనున్నట్లు సమాచారం. అయినప్పటికీ సాగు చట్టాల రద్దుపై అధికారిక ప్రకటన వచ్చే వరకూ తమ ఆందోళనలు కొనసాగుతాయని రైతు సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు.

పీఎంకేర్స్‌ నుంచి సహాయం అందించండి..

‘కేంద్ర ప్రభుత్వం తమ తప్పిదాన్ని ఒప్పుకొని సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమయంలో వీటికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్థిక సహాయాన్ని అందించాలనే డిమాండ్‌ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. గడిచిన ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా జరుగుతోన్న నిరసనల్లో దాదాపు 700 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రైతు సంఘాలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా దిల్లీ సరిహద్దులో కొనసాగిన ఆందోళనల సమయంలో ఆత్మహత్య చేసుకున్న రైతులతోపాటు లఖింపూర్‌ కారు దాడిలో మరణించిన వారికి పీఎం కేర్స్‌నుంచి ఆర్థిక సహాయాన్ని అందించాలి’ అని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ డిమాండ్‌ చేశారు. పీఎం కేర్స్‌లో లెక్కకు రాని డబ్బు ఎంతో ఉందని ఆరోపించిన ఆయన.. కేవలం రైతులకు క్షమాపణ చెబితే సరిపోదన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని