Nawab Malik: ఇప్పుడు మాలిక్ వంతు.. ఫడణవీస్‌పై సంచలన ఆరోపణలు..!

ముంబయి క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసు మహారాష్ట్ర అధికార, విపక్ష పార్టీల మధ్య ఘాటు విమర్శలకు దారితీస్తోంది. ఒకరు దీపావళి బాంబు అని, మరొకరు హైడ్రోజన్ బాంబు అని.. ఒకరిగురించి ఇంకొకరు సంచలన విషయాలు బయటపెడుతున్నారు.

Updated : 24 Sep 2022 15:34 IST

ముంబయి: ముంబయి క్రూజ్ నౌక డ్రగ్స్ కేసు మహారాష్ట్ర అధికార, విపక్ష పార్టీల మధ్య ఘాటు విమర్శలకు దారితీస్తోంది. ఒకరు దీపావళి బాంబు అని, మరొకరు హైడ్రోజన్ బాంబు అని.. సంచలన విషయాలు బయటపెడుతున్నారు. నిన్న మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్.. మంత్రి నవాబ్‌ మాలిక్‌కు అండర్ వరల్డ్‌తో సంబంధాలున్నాయని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో ఫడణవీస్ గురించి మాలిక్ పలు విషయాలు బయటపెట్టారు. దానిలో భాగంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘రియాన్ భాటి ఎవరు? అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధం ఉన్న భాటి.. నకిలీ పాస్‌పోర్టుతో పోలీసులకు చిక్కాడు. కానీ రెండు రోజుల్లోనే అతడిని వదిలేశారు. ఫడణవీస్, భాజపా పెద్దలు హాజరయ్యే వేడుకల్లో అతడు పలుమార్లు కనిపించాడు. ప్రధానిని ఈ వ్యవహారంలోకి లాగదల్చుకోలేదు కానీ.. ఆయనతో కూడా ఫొటోలు దిగేంత సంబంధాలున్నాయి. ఫడణవీస్ ఠానేలో నియమించిన పోలీసు అధికారులతో ఇతర దేశాల్లోని డాన్లు సంబంధాలు నెరిపారు. ఇవేకాకుండా తన హయాంలో నాగ్‌పూర్‌కి చెందిన నేరస్థుడు మున్నా యాదవ్‌ను నిర్మాణ రంగ కార్మికుల బోర్డుకు ఛైర్మన్‌గా నియమించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన హైదర్‌ అజాం.. మౌలానా అజాద్‌ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితుడయ్యారు. అంతేగాకుండా 2016లో డీమానిటైజేషన్ సందర్భంగా ఫడణవీస్ సహకారంతో నకిలీ కరెన్సీ రాకెట్ ఏ ఆటంకం లేకుండా సాగింది. ఆ సమయంలో సమీర్ వాంఖడే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌(డీఆర్‌ఐ)లో పనిచేస్తున్నారు’ అంటూ పలు ఆరోపణలు చేశారు. 1993 ముంబయి పేలుళ్ల కేసు దోషులతో మాలిక్‌కు సంబంధాలున్నాయని నిన్న ఫడణవీస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో వాటికి మాలిక్ కౌంటర్ ఇచ్చారు.

అబద్ధాలు చెప్పడం దినచర్యగా మారింది: అమృత ఫడణవీస్‌

మాలిక్ ఆరోపణలపై ఫడణవీస్ సతీమణి అమృత ఫడణవీస్ స్పందించారు. మీడియా సమావేశాలు నిర్వహించడం మాలిక్‌కు దినచర్యగా మారిందని, అందులో అబద్ధాలు మాత్రమే చెప్తారని ట్విటర్ వేదికగా మండిపడ్డారు. తన వాళ్లను, నల్లధనాన్ని రక్షించుకోవడమే వాటి లక్ష్యమని దుయ్యబట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని