Dynastic Parties: కుటుంబ పార్టీలు.. ప్రజాస్వామ్యానికే అతిపెద్ద ముప్పు!

తరతరాలపాటు ఒకే కుటుంబం చేతుల్లో ఒక రాజకీయ పార్టీ నడవడంతోపాటు పార్టీ వ్యవస్థ మొత్తం వారి నియంత్రణలో ఉండడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

Published : 26 Nov 2021 21:31 IST

ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

దిల్లీ: తరతరాలపాటు ఒకే కుటుంబం చేతుల్లో ఒక రాజకీయ పార్టీ నడవడంతో పాటు పార్టీ వ్యవస్థ మొత్తం వారి నియంత్రణలో ఉండడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన.. కొన్ని కుటుంబాల చేతుల్లోనే రాజకీయ పార్టీలు నడవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎటువంటి పేరు ప్రస్తావించకుండానే ‘కుటుంబం కోసం పార్టీ.. కుటుంబం చేతుల్లో పార్టీ’లు ఉన్నాయన్న ప్రధాని మోదీ.. ఇంతకుమించి ఏమీ చెప్పనవసరం లేదంటూ కాంగ్రెస్‌ పార్టీపై పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు.

ఒకరకమైన సంక్షోభమే..

‘ఈ కార్యక్రమం ఏ ప్రభుత్వానికో, ఏ రాజకీయ పార్టీకో లేదా ప్రధానమంత్రికో సంబంధించింది కాదు. ఈ సభకు స్పీకర్‌ గర్వకారణం. ఇది గౌరవప్రదమైన పదవి. ఇది రాజ్యాంగ గౌరవానికి, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ గౌరవానికి సంబంధించిన విషయం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ సమయంలో కాంగ్రెస్‌తో పాటు పలు విపక్ష పార్టీలను ఉద్దేశిస్తూ మాట్లాడిన ఆయన.. కుటుంబ పార్టీల పేరుతో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు.. భారత్‌ ఒకరకమైన సంక్షోభం వైపు వెళుతోంది. ఇటువంటి పరిణామాలు రాజ్యాంగంపట్ల అంకితభావం, ప్రజాస్వామ్యంపై నమ్మకమున్న పౌరులకు ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం’ అని కుటుంబ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా తరతరాలుగా ఒకే కుటుంబం నియంత్రణలో రాజకీయ పార్టీ ఉండడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య స్వభావాన్ని కోల్పోవడం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తాయని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు.

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రారంభించారు. ఈ వేడుకకు భారత ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, కేంద్రమంత్రులతో పాటు ఎన్‌డీఏ భాగస్వామ్యపక్షాలు హాజరయ్యాయి. వీటితోపాటు బిజూ జనతాదళ్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, బీఎస్‌పీ, తెలుగుదేశం పార్టీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. కానీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కేంద్ర ప్రభుత్వం బలహీనపరుస్తోందంటూ ఆరోపించిన కాంగ్రెస్‌తో సహా 15 విపక్ష పార్టీలు ఈ కార్యక్రమానికి డుమ్మాకొట్టాయి. ఈ నేపథ్యంలనే ప్రధానమంత్రి కుటుంబ పార్టీలపై ఘాటు విమర్శలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని