Guinness World Records: స్కై డైవింగ్‌లో గింగిరాలు తిరుగుతూ గిన్నిస్‌ రికార్డు

అమెరికాకు చెందిన కెబేకేత్‌ ఎడ్వార్డ్‌ స్నైడర్‌ స్కైడైవింగ్‌ చేసి ప్రతిష్ఠాత్మక గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నాడు. అయితే అత్యంత ఎత్తు నుంచి దూకి కాదు..అత్యధికసార్లు గింగిరాలు తిరిగి......

Published : 03 Dec 2021 20:52 IST

ఇంటర్నెట్ డెస్క్‌: స్కై డైవింగ్‌ చూస్తేనే చాలా మంది ఒళ్లు గగురుపొడుస్తుంది. మరి చేసేవారి పరిస్థితేంటో అర్థం చేసుకోండి. అయితే కొందరు దాన్ని వ్యాపకంలా మార్చుకుంటారు. ఇష్టంగా ఇలాంటి సాహసాలు చేస్తుంటారు. అత్యంత ఎత్తు నుంచి దూకి రికార్డులు కూడా సాధిస్తుంటారు. అమెరికాకు చెందిన కెబేకేత్‌ ఎడ్వార్డ్‌ స్నైడర్‌ తాజాగా ప్రతిష్ఠాత్మక గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నాడు. అయితే అత్యంత ఎత్తు నుంచి దూకి కాదు.. కిందకు దూకుతూ.. అత్యధికసార్లు గింగిరాలు తిరిగి. ఈజిప్ట్‌లోని ప్రఖ్యాత గాజా పిరమిడ్ల వద్ద ఈ గత నెల 1వ తేదీన ఈ ఫీట్‌ను చేశాడు.

13,500 ఫీట్ల ఎత్తునుంచి కెబే ఈ సాహసం చేశాడు. విమానంలో నుంచి కిందకు దూకి.. భూమికి చేరుకునే క్రమంలో అతడు ఏకంగా 160 సార్లు తిరిగి గతంలో ఉన్న రికార్డులను బద్దలుకొట్టాడు. ఈ డైవింగ్‌కు సంబంధించిన వీడియోలను అతడు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ అధికారులకు పంపించాడు. ఆ వీడియోలను ధ్రువీకరించిన అధికారులు.. కెబే ఫీట్‌కు తాజాగా గిన్నిస్‌ రికార్డుల్లో స్థానం కల్పించారు. అతడి సాహసానికి సంబంధించిన వీడియోలను సైతం సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు.

ఈ ఫీట్‌ సహా గిన్నిస్‌ రికార్డు పట్ల కెబేకేత్‌ హర్షం వ్యక్తం చేశాడు. పిరమిడ్ల పైన సర్ఫింగ్‌ చేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నాడు. ఇలాంటి ఫీట్లు చాలా ప్రమాదకరమని.. దీని వెనుక ఏళ్ల కృషి ఉందని పేర్కొన్నాడు. ఇప్పటివరకు దాదాపు 250 మందికి స్కైడైవింగ్‌లో మెళుకువలు నేర్పినట్లు తెలిపాడు. కెబే గతంలో జాతీయ ఛాంపియన్‌ కూడా.

Read latest National - International News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని