Published : 10/11/2021 17:12 IST

Dalai Lama: దలైలామా: నేను భారత్‌లోనే ఉంటా.. ఎందుకంటే?

చైనా నియంత్రణ ఎక్కువైందన్న ఆధ్యాత్మిక గురువు

టోక్యో: బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా (86) చైనా నాయకత్వాన్ని మరోసారి విమర్శించారు. భిన్న సంప్రదాయాల ప్రాముఖ్యతను వారు అర్థం చేసుకోలేరని విమర్శించారు. ముఖ్యంగా అక్కడి హాన్‌ వర్గ ఆధిపత్యం, నియంత్రణే ఎక్కువ ఉందన్నారు. అయితే, తోటి వ్యక్తిగా తనకు చైనా ప్రజలపై ఎటువంటి వ్యతిరేకత లేదన్నారు. కమ్యూనిజం, మార్క్సిజం భావాలకు తాను అనుకూలమన్న విషయాన్ని గుర్తుచేశారు. టోక్యో వేదికగా ఆన్‌లైన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆధ్యాత్మిక గురువు దలైలామా.. జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా భారత్‌లోనే ఉంటానన్న ఆయన.. ఇక్కడే ప్రశాంతంగా ఉందని వెల్లడించారు.

చైనా అర్థం చేసుకోలేదు..

‘మావో జెడాంగ్‌ నుంచి కమ్యూనిస్టు పార్టీ నేతల గురించి నాకు తెలుసు. వారి ఆలోచనలు మంచివే. కానీ, కొన్నిసార్లు అత్యంత కఠినంగా నియంత్రణలు ఉంటాయి. అయితే, నేటితరం నేతల ఆలోచనల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నా’ అని ఆధ్యాత్మిక గురువు దలైలామా పేర్కొన్నారు. టిబెట్‌, షిన్‌జియాంగ్‌ విషయానికొస్తే.. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక సంస్కృతి ఉంది. కాబట్టి అత్యంత సంకుచిత మనస్తత్వం కలిగిన చైనా నాయకులు ఇక్కడి ప్రత్యేక సంస్కృతులను అర్థం చేసుకోలేరు. చైనాలో హాన్‌ జాతికి చెందిన వారే కాకుండా భిన్న జాతులు, ఇతర వర్గాల ప్రజలు ఉన్నారు.. కానీ, హాన్‌ వర్గం ఆధిపత్యం, వారి నియంత్రణే అధికంగా ఉంటుందన్న మాట వాస్తవమని దలైలామా స్పష్టం చేశారు.

కమ్యూనిస్టు పార్టీలో చేరాలని..

ఆన్‌లైన్‌ వేదికగా జరిగిన ఈ సమావేశంలో జర్నలిస్టులు పలు అంతర్జాతీయ అంశాలతోపాటు చైనాకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. వీటికి సమాధానమిచ్చిన దలైలామా.. కమ్యూనిజం, మార్క్సిజం ఆలోచనలకు అనుకూలమన్న విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా ఒకసారి ఏకంగా కమ్యూనిస్టు పార్టీలోనే చేరాలనే ఆలోచన వచ్చిందని దలైలామా పేర్కొన్నారు. అప్పటి సంఘటనను నవ్వూతూ వివరించిన ఆయన.. ఇందుకు ఓ మిత్రుడు అభ్యంతరం చెప్పడంతో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక తైవాన్‌పైనా ఆయన స్పందించారు. చైనా నుంచి తైవాన్‌ ఆర్థికంగా ఎంతో సహాయం పొందుతున్న మాట వాస్తవమన్నారు. కానీ, బౌద్ధ మతం, చైనా సంస్కృతి విషయానికొస్తే తైవానీయుల నుంచి చైనా ప్రజలు ఎంతో నేర్చుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

భారత్‌లోనే ఉంటా..

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను కలిసే ఆలోచన లేదని దలైలామా స్పష్టం చేశారు. కానీ, వయసు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడున్న తన మిత్రులను కలవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. కానీ, చైనా-తైవాన్‌ మధ్య సంబంధాలు కాస్త సున్నితంగా మారినందున తైవాన్‌కు మాత్రం వెళ్లకపోవచ్చని పేర్కొన్నారు. ఇక భారత్‌లోనే ప్రశాంతంగా ఉంటానన్న దలైలామా.. మతసామరస్యానికి భారత్‌ కేంద్రబిందువని కొనియాడారు. అన్ని మతాల సారాంశము ఒక్కటేనని, కేవలం రాజకీయ నాయకులతోనే అసలు సమస్య అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మతాన్ని కూడా రాజకీయం చేశారని.. ఇప్పుడు అదే ప్రధాన సమస్య అని దలైలామా ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని