Omicron: ఒమిక్రాన్‌ వేరియంట్‌పై పనిచేస్తున్న టీకాలు!

అందుబాటులో ఉన్న కొవిడ్​-19 టీకాలు ఒమిక్రాన్​ రకంపై పనిచేస్తున్నాయని దక్షిణాఫ్రికా ఆరోగ్యశాఖ మంత్రి జో ఫాహ్లా వెల్లడించారు.....

Published : 27 Nov 2021 19:15 IST

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్​ ‘ఒమిక్రాన్​’(B.1.1.529) ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. డెల్టా వంటి రకాలకన్నా అత్యంత వేగంగా వ్యాప్తి చెందటమే కాకుండా.. తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న కారణంగా ప్రపంచ దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ కాస్త ఊరట కలిగించే వార్త అందించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవిడ్​-19 టీకాలు ఒమిక్రాన్​ రకంపై పనిచేస్తున్నాయని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి జో ఫాహ్లా వెల్లడించారు. ఇప్పటివరకు కొద్ది మందిలోనే ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు తెలిపారు. అయితే జన్యుపరమైన మార్పుల కారణంగా ఈ వేరియంట్‌ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయితే, ఒమిక్రాన్‌ వ్యాప్తి తొలి దశలోనే ఉందని.. టీకా తీసుకున్న వారిలో ఈ వేరియంట్​ ఎంత మేర ప్రభావం చూపుతుందో ఇంకా తెలియదని కొందరు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

పరిశోధనలు ప్రారంభించిన టీకా ఉత్పత్తి సంస్థలు

కరోనా కొత్త వేరియంట్​పై తమ టీకాల పనితీరును అంచనా వేసేందుకు పరిశోధనలు ప్రారంభించినట్లు టీకా తయారీ సంస్థలు ఫైజర్​, బయోఎన్​టెక్​ శుక్రవారం ప్రకటించాయి. తమ ఎమ్​ఆర్​ఎన్​ఏ వ్యాక్సిన్​పై ఆరు వారాలపాటు పరిశోధన చేస్తామని, కొత్త వేరియంట్​పై పనితీరును విశ్లేషించి.. 100 రోజుల్లోనే పంపిణీ ప్రారంభిస్తామని పేర్కొన్నాయి. మోడెర్నా, జాన్సన్​ అండ్​ జాన్సన్​, ఆస్ట్రాజెనెకా సంస్థలు సైతం పరిశోధనలు ప్రారంభించినట్లు వెల్లడించాయి. ఒమిక్రాన్​ వేరియంట్​ కోసం బూస్టర్​ డోస్​ను అభివృద్ధి చేయనున్నట్లు మోడెర్నా తెలిపింది.

 

Read latest National - International News and Telugu News

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని