Covid R-Value: మళ్లీ పెరుగుతున్న ఆర్‌-ఫ్యాక్టర్‌.. పలు రాష్ట్రాల్లో ఆందోళనకరంగా వైరస్‌ ఉద్ధృతి!

కరోనా వైరస్‌ సంక్రమణ (రీ ప్రొడక్టివ్‌) రేటు పెరుగుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కేసుల తీవ్రత పెరగడంతో ఆగస్టు నెల మూడో వారానికి ఆర్‌-విలువ 1.2కి పెరిగినట్లు పరిశోధకులు వెల్లడించారు.

Published : 03 Sep 2021 20:49 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ మూడో ముప్పు అనివార్యమని నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో గతకొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న కొవిడ్‌ ఉద్ధృతితో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా కరోనా వైరస్‌ సంక్రమణ (రీ ప్రొడక్టివ్‌) రేటు పెరుగుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కేసుల తీవ్రత పెరగడంతో ఆగస్టు నెల మూడో వారానికి ఆర్‌-విలువ 1.2కి పెరిగినట్లు పరిశోధకులు వెల్లడించారు.

దేశవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా వైరస్‌ విస్తృతి కాస్త అదుపులోనే ఉంది. ఆగస్టు 14-17 మధ్య కాలంలో 0.89గా ఉన్న సంక్రమణ రేటు (ఆర్‌-విలువ) వారంలోనే ఒక్కసారిగా పెరిగింది. ఆగస్టు 24-29 నాటికి అది 1.17కి పెరిగినట్లు చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ (ఐఎంఎస్‌) అంచనా వేసింది. ఇలా ఆగస్టు చివరి నాటికి దేశంలో ఆర్‌-విలువ 1.2కి చేరడం ఆందోళన కలిగించే విషయమేనని ఐఎంఎస్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు. గతంలో కొవిడ్‌ తీవ్రత అధికంగా ఉన్న సమయంలోనే ఆర్‌-విలువ 1.03గా ఉందని.. కానీ, ప్రస్తుతం అంతకంటే ఎక్కువగా ఉండడం కలవరపెట్టే విషయమేనని చెప్పారు.

ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, మిజోరం, జమ్మూకశ్మీర్‌లలో ఆర్‌-విలువ 1 కంటే ఎక్కువగా ఉందని ఐఎంఎస్‌ శాస్త్రవేత్త సితాభ్రా సిన్హా పేర్కొన్నారు. కేరళలో కొవిడ్‌ ఆర్‌-విలువ 1.33, మిజోరంలో 1.36, జమ్మూకశ్మీర్‌లో 1.25, మహారాష్ట్రలో 1.06, ఆంధ్రప్రదేశ్‌లో 1.09గా ఉన్నట్లు చెప్పారు. వైరస్‌ సంక్రమణ రేటును తెలిపే ఆర్‌-విలువ ఒకటి కంటే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే విషయమేనని సితాభ్రా సిన్హా అభిప్రాయపడ్డారు. ఆర్‌-విలువ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కొవిడ్‌ కట్టడి చర్యలు మరింత చేపట్టాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని