Published : 01/11/2021 21:29 IST

Covid Deaths: కొవిడ్‌ విలయం.. 22 నెలల్లోనే 50లక్షల మంది బలి!

పలు దేశాల్లో మళ్లీ పెరుగుతున్న వైరస్‌ విజృంభణ

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో ప్రపంచ దేశాలు వణికిపోతూనే ఉన్నాయి. చైనాలో బయటపడి అనతికాలంలోనే యావత్‌ ప్రపంచాన్ని చుట్టుముట్టిన మహమ్మారి 22నెలల వ్యవధిలోనే లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ మరణాల సంఖ్య 50లక్షలు దాటింది. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ ప్రకారం నవంబర్‌ 1వ తేదీ నాటికి ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ మృతుల సంఖ్య 50లక్షల ఒక వెయ్యికి చేరింది.

రికార్డు మరణాలు..

కొవిడ్‌ విలయానికి అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌, బ్రిటన్‌, బ్రెజిల్‌ దేశాల ప్రజలు విలవిలలాడిపోయారు. ఏ దేశంలో లేని విధంగా అగ్రరాజ్యం అమెరికాలో అత్యధికంగా 7,40,000 మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మృతుల సంఖ్య 50లక్షలు దాటగా.. ఇందులో సగం కేవలం ఈ నాలుగు ప్రాంతాల్లోనే ఉన్నాయి. భారత్‌లోనూ 4లక్షల 58వేల మంది మృత్యువాతపడ్డారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌-19తో మరణించిన వారి సంఖ్య అనధికారికంగా మరింత ఎక్కువగానే ఉన్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్నప్పటికీ అమెరికా, రష్యాలో కొవిడ్‌ మృత్యుఘోష కొనసాగుతూనే ఉంది. గడిచిన నెల వ్యవధిలోనే అమెరికాలో 43వేల మంది ప్రాణాలు కోల్పోగా.. రష్యాలో 28వేల మంది కొవిడ్‌ బాధితులు చనిపోయారు. ఇదే సమయంలో కొన్ని సంపన్న దేశాలతో (అమెరికా, బ్రిటన్‌, రష్యా) పోలిస్తే భారత్‌లో రోజువారీ కొవిడ్‌ మరణాలు తగ్గుముఖం పట్టడం కాస్త ఊరట కలిగించే విషయమేనని నివేదికలు అభిప్రాయపడుతున్నాయి.

నార్వేలోని పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఓస్లో (PSIO) సంస్థ అంచనా ప్రకారం.. కొవిడ్‌-19 బలి తీసుకున్న ఈ మరణాల సంఖ్య అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌, శాన్‌ఫ్రాన్సిస్కో నగరాల జనాభాతో సమానం. 1950 నుంచి ఇప్పటివరకు వివిధ దేశాల మధ్య జరిగిన యుద్ధాల్లో మరణించిన వారి సంఖ్య కంటే కొవిడ్‌ మరణాలే ఎక్కువ. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణాలుగా ఉన్న హృదయ సంబంధ సమస్యలు, స్ట్రోక్‌ తర్వాత కొవిడ్‌-19 మూడో కారణంగా నిలిచింది.

మరోసారి విజృంభణ..

కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో వైరస్‌ ఉద్ధృతి మరోసారి పెరిగింది. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్‌తో పాటు పలు యూరప్‌ దేశాల్లో మళ్లీ విజృంభిస్తోంది. వ్యాక్సిన్‌లపై అసత్య ప్రచారాలు, అక్కడి ప్రభుత్వాలపై విశ్వాసం లేకపోవడంతో టీకా తీసుకునేందుకు ప్రజలు ముందుకు రాలేకపోతున్నారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఉక్రెయిన్‌లో ఇప్పటివరకు 17శాతం మంది రెండు మోతాదుల్లో వ్యాక్సిన్‌ తీసుకోగా ఆర్మేనియాలో కేవలం 7శాతం అర్హులు మాత్రమే రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ పొందారు. ఇక దాదాపు 130కోట్ల జనాభా కలిగిన ఆఫ్రికా దేశాల్లో కేవలం 5శాతం మందికి మాత్రమే పూర్తిస్థాయిలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందింది. ఇలా ఓ వైపు సంపన్న దేశాలు బూస్టర్‌ డోసును అందించే ప్రక్రియ ముమ్మరం చేస్తున్న సమయంలో పేద దేశాలు మాత్రం కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూపులు చూస్తున్నాయి.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్