China ZeroCovid: చైనాను వెంటాడుతోన్న ‘జీరో-కొవిడ్‌’ కష్టాలు..!

కరోనాకు పుట్టినిళ్లైన చైనా మాత్రం ‘కొవిడ్‌-జీరో (Zero Covid)’ వ్యూహంతోనే కరోనా కట్టడిలో ముందుకెళుతోంది.

Published : 08 Nov 2021 19:45 IST

కేసులను సున్నాకు తీసుకొచ్చే వ్యూహంతోనే కొవిడ్‌పై పోరు

బీజింగ్‌: యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కొవిడ్‌ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు వివిధ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ వైరస్‌ రూపాంతరం చెందుతూ మళ్లీ విజృంభిస్తుండడంతో పలు దేశాలు కట్టడి వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ముఖ్యంగా వైరస్‌తో కలిసి జీవిస్తూనే మహమ్మారిపై పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే సమయంలో కరోనాకు పుట్టినిల్లైన చైనా మాత్రం ‘కొవిడ్‌-జీరో (Zero Covid)’ వ్యూహంతోనే ముందుకెళుతోంది. ఇదే సమయంలో అక్కడ పలు నగరాల్లో వైరస్‌ ఉద్ధృతి పెరగడంతో నానా కష్టాలు పడుతోంది.

రోజురోజుకు రూపాంతరం చెందుతోన్న కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు.. వైరస్‌తో కలిసి జీవించే (Live with Covid) వ్యూహాన్ని ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయి. ఓవైపు జాగ్రత్తలు తీసుకుంటూనే మరోవైపు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కృషి చేస్తున్నాయి. కానీ, చైనా మాత్రం కొవిడ్‌ కేసులను సున్నాకు తీసుకువచ్చే ‘జీరో-కొవిడ్‌’ కట్టడి వ్యూహాన్నే నమ్ముకుంది. దీంతో ఒక్క కేసు వెలుగు చూసినా.. లక్షల సంఖ్యలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేపడుతోంది. ఇందుకోసం భారీ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటికితోడు వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా లాక్‌డౌన్‌ విధించడంతోపాటు విమాన ప్రయాణాలపైనా ఆంక్షలు కొనసాగిస్తోంది. గత కొంతకాలంగా పలు ప్రావిన్సుల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయలేక చైనా తీవ్రంగా శ్రమిస్తోంది.

సమర్థించుకుంటున్న డ్రాగన్‌..

అధిక జనాభా కలిగిన చైనాలో వైరస్‌ కట్టడికి అనుసరిస్తోన్న జీరో వ్యూహమే మేలని స్థానిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ వైరస్‌తో కలిసి జీవించాల్సి వస్తే ఎంతోమంది ఇన్‌ఫెక్షన్‌ బారినపడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది చైనా ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. అందుకే జీరో కట్టడి వ్యూహాన్ని అమలు చేస్తోందని అంటున్నారు. అయితే, ఈ వ్యూహం ఎంతకాలం విజయవంతం అవుతుందో చెప్పలేమని చైనా ఆరోగ్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ఈ విధానంపై చైనా ప్రజలు సంతృప్తిగానే ఉన్నట్లు పేర్కొంటున్నారు. అయితే, శీతాకాలంలో కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నందున చైనా ప్రభుత్వం తన విధానంపై పునః పరిశీలన చేసుకోవచ్చని ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీకి చెందిన అంటువ్యాధుల నిపుణులు పీటర్‌ కల్లిగ్‌నాన్‌ పేర్కొన్నారు. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, సింగపూర్‌ దేశాలు కూడా చైనా వ్యూహాన్నే అమలు చేస్తున్నాయని గుర్తుచేశారు.

పలు రంగాలపై ప్రతికూల ప్రభావమే..

చైనా అనుసరిస్తోన్న జీరో కొవిడ్‌ వ్యూహం వల్ల పలు రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని మార్కెట్‌ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా విదేశీ పర్యాటకులకు కేంద్రంగా ఉండే ఆతిథ్య రంగం కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని బీఎన్‌పీ పరిబాస్‌ అంతర్జాతీయ బ్యాంకింగ్‌ సంస్థకు చెందిన నిపుణురాలు జెస్సికా టీ అంచనా వేశారు. వచ్చే ఏడాది మార్చిలో జరిగే నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ సమావేశం వరకూ కొవిడ్‌ కట్టడి వ్యూహంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని చైనాలోని స్టాండర్డ్‌ ఛార్టర్డ్‌ బ్యాంక్‌కి చెందిన చీఫ్‌ ఎకనమిస్ట్‌ షువాంగ్‌ డింగ్‌ పేర్కొన్నారు. అప్పటివరకు ఇతర దేశాల్లో వ్యాక్సినేషన్‌పై హెర్డ్‌ ఇమ్యూనిటీ ఫలితాలు, కొవిడ్‌ను స్థానిక వ్యాప్తిగా పరిగణించే ప్రకటనలను పరిశీలించిన తర్వాత చైనా తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

అప్పటివరకూ సరిహద్దుల మూతేనా..?

చైనాలో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతున్న దృష్ట్యా దేశ సరిహద్దులను ఆ ప్రభుత్వం మూసివేసింది. ఆంక్షల నడుమ పరిమిత సంఖ్యలో మాత్రమే విదేశీయులను అనుమతి ఇస్తోంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందికరంగా మారాయి. అంతేకాకుండా ఇతర దేశాల ఎగుమతి, దిగుమతులపైనా ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినా చైనాలో జరగనున్న వింటర్‌ ఒలింపిక్స్‌ వరకూ అంతర్జాతీయ కొవిడ్‌ ఆంక్షలను చైనా ఎత్తివేయకపోవచ్చని అక్కడి పర్యాటకరంగ నిపుణులు గేరీ బొవెర్‌మ్యాన్‌ అంచనా వేశారు. మరో ఏడాది తర్వాతే సరిహద్దు ఆంక్షలను చైనా ఎత్తివేసే అవకాశం ఉందన్నారు. ఇలా వైరస్‌ కట్టడిని సమర్థంగా చేస్తున్నామని చెప్పుకుంటున్న చైనా.. జీరో కొవిడ్‌ వ్యూహంతో మాత్రం పలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని