CBI Raids: అనిల్‌ దేశ్‌ముఖ్‌ నివాసంలో సీబీఐ సోదాలు

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ నివాసంతో ఆయనకు చెందిన పలు కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (CBI) సీబీఐ సోదాలు జరిపింది.

Published : 11 Oct 2021 23:54 IST

మాజీ హోంమంత్రిపై అవినీతి ఆరోపణల కేసు దర్యాప్తు

ముంబయి: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ నివాసంతో పాటు ఆయనకు చెందిన పలు కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (CBI) సోదాలు జరిపింది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి జరుగుతోన్న దర్యాప్తుకు సంబంధించి కీలక పత్రాల లీకేజీ వ్యవహారంలో ఈ సోదాలు చేపట్టినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. వారెంటుతో వెళ్లిన సీబీఐ బృందాలు నాగ్‌పూర్‌తో పాటు ముంబయిలోని ఆయన నివాసాల్లో సోమవారం ఉదయం ఒకేసమయంలో సోదాలు నిర్వహించింది.

మహారాష్ట్ర హోంమంత్రిగా పనిచేసిన అనిల్‌ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం ఆయనపై కేసు నమోదు కావడంతో బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. విచారణ సమయంలో దేశ్‌ముఖ్‌కు క్లీన్‌చిట్‌ ఇవ్వనుందనే సమాచారం మీడియాకు లీక్‌ అయ్యింది. ఈ పరిణామాలు సీబీఐకి తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. విచారణ సమయంలోనే కీలక పత్రాలు లీక్‌ ఎలా అయ్యాయనే అంశంపై దృష్టిపెట్టిన సీబీఐ.. దేశ్‌ముఖ్‌ న్యాయవాది ఆనంద్‌తో పాటు ఎస్‌ఐ అభిషేక్‌ తివారీ సీబీఐ సెప్టెంబర్‌ 2న అరెస్టు చేసింది. ఈ వ్యవహారంలో మరింత సమాచారం కోసం దేశ్‌ముఖ్‌ నివాసాల్లో సీబీఐ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే, నెలకు రూ.వంద కోట్లు వసూలు చేయాలంటూ సస్పెండైన పోలీసు అధికారి సచిన్‌ వాజేను అప్పటి హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆదేశించినట్లు ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా పోలీసు అధికారుల బదిలీల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. వీటిపై విచారణ జరిపించాలని పరంబీర్‌ సింగ్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన బాంబే హైకోర్టు.. ఈ ఆరోపణలపై విచారణ జరపాలని సీబీఐని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ బృందం అనిల్‌ దేశ్‌ముఖ్‌తో పాటు ఆయన సన్నిహితులను విచారించింది. ఇదే సమయంలో తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణపై బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలని అనిల్‌ దేశ్‌ముఖ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ.. అక్కడ ఆయనకు చుక్కెదురైంది. అనిల్‌ దేశ్‌ముఖ్‌ విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు సీబీఐ దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని