Bolsonaro: కరోనా టీకాతో ఎయిడ్స్​కు ముడిపెట్టిన బ్రెజిల్‌ అధ్యక్షుడిపై దర్యాప్తు

కరోనా టీకాలు, ఎయిడ్స్​కు ముడిపెడుతూ బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సొనారో చేసిన వ్యాఖ్యలపై దర్యాప్తు చేపట్టాలని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది......

Published : 04 Dec 2021 17:25 IST

బ్రెసీలియా: కొవిడ్​ టీకాలు తీసుకుంటే ఎయిడ్స్​ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుందని బ్రెజిల్​ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారో గతంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలు చేసినందుకు ఇప్పుడు ఆయన చిక్కుల్లో పడ్డారు. కరోనా టీకాలు, ఎయిడ్స్​కు ముడిపెడుతూ బోల్సొనారో చేసిన వ్యాఖ్యలపై దర్యాప్తు చేపట్టాలని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ అలెగ్జాండర్​ డీ మోరేస్​.. ప్రాసిక్యూటర్​ అగస్టో ఆరస్​కు సూచించారు.

బ్రెజిల్‌ అధ్యక్షుడు అక్టోబర్​ 24న మీడియాతో మాట్లాడుతూ.. ‘పూర్తిస్థాయిలో వ్యాక్సిన్​ తీసుకున్న ప్రజలు.. ఎయిడ్స్​ బారినపడే ముప్పు ఎక్కువగా ఉందని బ్రిటన్​ ప్రభుత్వం రూపొందించిన ఓ నివేదికలో బయటపడింది’ అని వ్యాఖ్యానించారు. కాగా ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. వెంటనే ఆ వీడియోను ఫేస్​బుక్​, ఇన్‌స్టాగ్రామ్​లు తొలగించాయి. అయితే అధ్యక్షుడిపై దర్యాప్తు జరగడం ప్రశ్నార్థకమే. కరోనా మహమ్మారి నిర్వహణలో బోల్సొనారోపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆయనపై విచారణ జరపాలని సెనేట్​ కమిటీ పలుమార్లు డిమాండ్​ చేసింది. కానీ అది సాధ్యం కాలేదు. కొవిడ్​ నిబంధనలను అధ్యక్షుడు పాటించేవారు కాదు. మాస్కు ధరించకుండానే తిరిగేవారు. ఇప్పటికీ కొవిడ్​ టీకా తీసుకోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని