Omicron: ఒమిక్రాన్‌కు తక్షణమే అడ్డుకట్ట.. సులభ మార్గం ఏంటంటే!

ప్రమాదకరమైన వేరియంట్‌గా భావిస్తోన్న ఒమిక్రాన్‌కు తక్షణమే అడ్డుకట్ట వేయాలంటే అందుకు అవసరమైన బూస్టర్‌ డోసులు రూపొందించడమే సులభ మార్గమని ప్రముఖ వైరాలజిస్టు జాకబ్‌ జాన్‌ పేర్కొన్నారు.

Published : 01 Dec 2021 22:49 IST

ప్రముఖ వైరాలజిస్ట్‌ డాక్టర్‌ జాకబ్‌ జాన్‌

దిల్లీ: ప్రమాదకరమైన వేరియంట్‌గా భావిస్తోన్న ఒమిక్రాన్‌కు తక్షణమే అడ్డుకట్ట వేయాలంటే అందుకు అవసరమైన బూస్టర్‌ డోసులు రూపొందించడమే సులభ మార్గమని ప్రముఖ వైరాలజిస్టు జాకబ్‌ జాన్‌ పేర్కొన్నారు. ఇక ఈ వేరియంట్‌ థర్డ్‌వేవ్‌కు కారణం కాకపోవచ్చని అంచనా వేసిన ఆయన.. కొత్త వేరియంట్లతో బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌లు రావడం సహజమేనని అన్నారు. అయినప్పటికీ ఆశాజనకంగా ఉంటూనే.. ఎటువంటి ముప్పు వచ్చినా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారికీ వైరస్‌ సోకే అవకాశం ఉందని (Breakthrough) నిపుణులు హెచ్చరిస్తోన్న నేపథ్యంలో జాకబ్‌ జాన్‌ ఈ విధంగా స్పందించారు.

భయం అవసరం లేదు..

‘మనదేశంలో 8 నెలల పాటు కొనసాగిన కొవిడ్‌-19 తొలివేవ్‌లో దాదాపు 30శాతం మంది భారతీయులు వైరస్‌ బారినపడ్డారు. అనంతరం మూడు నెలల పాటు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సెకండ్‌ వేవ్‌లో అత్యధికంగా 75 నుంచి 80శాతం (రీ ఇన్‌ఫెక్షన్‌లతో కలిపి) వైరస్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలో విస్తృత వేగంతో కొత్త వేరియంట్‌ విరుచుకుపడితే ఏమవుతుందో అంచనా వేయలేం. అయితే, ప్రజలు భయపడుతున్నంత భయం మాత్రం ఉండకపోవచ్చు. థర్డ్‌ వేవ్‌కు కూడా ఇది కారణం కాకపోవచ్చు. అయినప్పటికీ వైరస్‌ను రాకుండా చూసుకోవడంతోపాటు రోగనిరోధకత (హెర్డ్‌ ఇమ్యునిటీ)ని పెంచుకోవడమే తెలివైన మార్గం’ అని ఐసీఎంఆర్‌కు చెందిన ‘సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఇన్‌ వైరాలజీ’ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ జాకబ్‌ జాన్‌ పేర్కొన్నారు.

వ్యాక్సినేషన్‌ వేగం పెంచాలి..

‘దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 30శాతం మందికి పూర్తి మోతాదులో (రెండు డోసుల్లో) వ్యాక్సిన్‌ అందింది. వీటిని మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా వ్యాక్సిన్‌ తీసుకోని వారికి వ్యాక్సిన్‌ అందించడం, రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్‌ ఇవ్వడం అత్యంత ముఖ్యం. వేరియంట్‌కు తక్షణమే అడ్డుకట్ట వేసేందుకు బూస్టర్‌ డోసులను అందించడమే తేలికైన మార్గం. పిల్లలకు, గర్భిణీలకు వ్యాక్సిన్‌ (పూర్తి మోతాదులో) ఇవ్వాలి’ అని జాకబ్‌ జాన్‌ పేర్కొన్నారు. ఇక కొత్త వేరియంట్లను వ్యాక్సిన్‌లు ఏమేరకు ఎదుర్కొంటాయి? అన్న ప్రశ్నకు బదులిచ్చిన ఆయన.. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కూడా ఇన్‌ఫెక్షన్‌ (Breakthrough) బారినపడడం సహజమేనన్నారు. కొత్త వేరియంట్ల నుంచి రక్షణ కల్పించడంతోపాటు వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు కావాల్సిన రోగనిరోధకతను బూస్టర్‌ డోసుల వల్ల పొందవచ్చని స్పష్టం చేశారు.

డెల్టా కంటే ప్రమాదకరమే..?

ఇక ఒమిక్రాన్‌లో ఇప్పటి వరకు 34 మ్యుటేషన్లు జరిగినట్లు పేర్కొన్న జాకబ్‌ జాన్‌, ఆందోళనకర ఆల్ఫా బీటా, గామా, డెల్టా వేరియంట్‌ కంటే ఇవి ఎక్కువేనని వెల్లడించారు. ఒరిజినల్‌ వేరియంట్‌తో పోలిస్తే డెల్టాకు రెండు నుంచి మూడు రెట్లు అధికంగా వ్యాప్తిచెందే గుణం దీనికి ఉందన్నారు. ఒమిక్రాన్‌కు అంతకంటే ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఉందని.. దాదాపు పదిరెట్లు ఎక్కువ వ్యాప్తి చెందే సామర్థ్యం ఉన్నట్లు స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ శాస్త్రవేత్త తనతో చెప్పినట్లు వివరించారు. అంతేకాకుండా రెండు డోసుల వల్లే కలిగే రోగనిరోధకతను తట్టుకునే సామర్థం ఈ కొత్త వేరియంట్‌కు ఉండే అవకాశం ఉన్నందున బూస్టర్‌ డోసులను రూపకల్పనకు నడుం బిగించాలని  పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని