RoboTaxi: చైనా రోడ్లపై.. ఇక రోబోటాక్సీలు..!

డ్రైవర్‌ అవసరం లేకుండా నడిచే టాక్సీల (Robotaxi) సేవలకు ఆమోదం తెలిపింది. చైనా టెక్‌ సంస్థ బైడూ (Baidu) గ్రూపుతో పాటు మరో సెల్ఫ్‌ డ్రైవింగ్‌ స్టార్టప్‌ కంపెనీ పోనీ.ఏఐ (Pony.ai)లకు చెందిన రోబోటాక్సీలను వాణిజ్యపరంగా నడిపించుకునేందుకు అనుమతి ఇచ్చింది.

Published : 25 Nov 2021 23:54 IST

అనుమతించిన చైనా ప్రభుత్వం

బీజింగ్‌: ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతోన్న సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ (AI) సహాయంతో పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మానవరహిత సేవలను అందించేందుకు పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగా మరో ముందడుగు వేసిన చైనా.. స్వయంచాలిత (డ్రైవర్‌ అవసరం లేకుండా నడిచే) టాక్సీ సేవలకు ఆమోదం తెలిపింది. అక్కడి టెక్‌ దిగ్గజ సంస్థ బైడూ (Baidu) గ్రూపుతో పాటు మరో సెల్ఫ్‌ డ్రైవింగ్‌ స్టార్టప్‌ కంపెనీ పోనీ.ఏఐ (Pony.ai) లకు చెందిన రోబోటాక్సీలను (Robotaxi) వాణిజ్యపరంగా నడిపించుకునేందుకు అనుమతి ఇచ్చింది. తొలుత ఈ టాక్సీలకు చైనా రాజధాని బీజింగ్‌లో మాత్రమే నడిపేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొంది. దీంతో త్వరలోనే దాదాపు 100 రోబోటాక్సీలు బీజింగ్‌ రోడ్లపై తిరుగనున్నాయి.

చైనా టెక్‌ సంస్థ బైడూ ‘అపోలో గో (Apollo Go)’ పేరుతో రోబోటాక్సీ కార్లను రూపొందించింది. వీటిని చైనా రోడ్లపై గతంలోనే ప్రయోగించిన బైడూ.. అందులో విజయవంతమైంది. తాజాగా వాణిజ్య సేవలకు అధికారికంగా అనుమతి రావడం పట్ల బైడూ సంస్థ హర్షం వ్యక్తం చేసింది. తొలుత ఇవి బీజింగ్‌లోని నివాస, వాణిజ్య ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. సాధారణంగా ప్రీమియం క్యాబ్‌ సర్వీసుల మాదిరిగానే రోబోటాక్సీలు ఉంటాయని బైడూ అధికార ప్రతినిధి వెల్లడించారు. బైడూకు చెందిన 67 రోబోటాక్సీల సేవలను నగరంలోని 600 పికప్‌, డ్రాప్‌ పాయింట్ల వద్ద పొందవచ్చని వెల్లడించారు. ఇక టొయోటా మోటార్స్‌ ఆధ్వర్యంలోని పోనీ.ఏఐకు కూడా రోబో టాక్సీలను నడిపించేందుకు చైనా అనుమతి ఇచ్చింది.

ఇదిలాఉంటే, రోబో టాక్సీలను నడిపేందుకు బైడూ సంస్థకు ఈ ఏడాది మే నెలలోనే అనుమతి లభించింది. అయితే, బీజింగ్‌లోని కేవలం 2.7కి.మీ పరిధిలోనే నడిపేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతివ్వగా.. తాజాగా బీజింగ్‌ నగరం మొత్తం నడిపేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇక 2025 నాటికి ‘అపోలో గో’ సర్వీసులను 65 పట్టణాలకు విస్తరించాలని బైడూ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2030 నాటికి దాదాపు 100 నగరాలకు తమ రోబోటాక్సీ సేవలను పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని బైడూ టెక్‌ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని