Covaxin: విదేశాలకు ‘కొవాగ్జిన్‌’ ఎగుమతులు ప్రారంభించిన భారత్‌ బయోటెక్‌

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీలో దూసుకెళ్తున్న దేశీయ సంస్థ భారత్‌ బయోటెక్‌.. విదేశాలకు టీకాలను ఎగుమతి చేసే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది.

Published : 29 Nov 2021 19:03 IST

దిల్లీ: కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీలో దూసుకెళ్తున్న దేశీయ సంస్థ భారత్‌ బయోటెక్‌.. విదేశాలకు టీకాలను ఎగుమతి చేసే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న విదేశీ ఆర్డర్ల ఎగుమతిని ఈ నెలలో చేపట్టామని భారత్‌ బయోటెక్‌ పేర్కొంది. డిసెంబర్‌లో వీటి ఎగుమతిని మరింతగా పెంచుతామని వెల్లడించింది. ఇప్పటికే కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి చాలా దేశాలు అనుమతి ఇచ్చాయని.. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ నెలలో వాటికి కూడా ఎగుమతులు ప్రారంభిస్తామని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇక భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన కొవాగ్జిన్‌ టీకాకు ఈ మధ్యే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అనుమతి లభించిన విషయం తెలిసిందే. దీంతో ఈ టీకా డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర వినియోగ జాబితాలో (ఎమర్జెన్సీ యూజ్‌ ఆఫ్‌ లిస్టింగ్‌-ఈయూఎల్‌) చేరింది. ఈ గుర్తింపుతో ప్రపంచ దేశాలకు కొవాగ్జిన్‌ ఎగుమతికి మార్గం సుగమమైంది. అంతేకాకుండా ఈ టీకాను తీసుకున్న పౌరులు విదేశాలకు వెళ్లినప్పుడు ఎలాంటి ఆంక్షలు గానీ, స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన అవసరం గానీ ఉండదు.

ఇదిలాఉంటే, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 122 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో 78 కోట్ల మంది అర్హులకు తొలి డోసును అందించగా.. 44 కోట్ల మందికి పూర్తి మోతాదులో వ్యాక్సిన్‌ అందించారు. నిత్యం దాదాపు 40లక్షలకుపైగా కొవిడ్‌ డోసుల పంపిణీ చేస్తున్నారు. వ్యాక్సినేషన్‌లో భాగంగా కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ను అందిస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. వాటిని రాష్ట్రాలకు ఉచితంగానే సరఫరా చేస్తోంది. భారత్‌లో వ్యాక్సినేషన్‌కు అవసరమైన డోసుల నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విదేశాలకు ఎగుమతి చేసేందుకు వ్యాక్సిన్‌ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో భారత్‌ బయోటెక్‌తో పాటు సీరం ఇన్‌స్టిట్యూట్‌ సంస్థలు విదేశాలకు కొవిడ్‌ టీకా ఎగుమతులను ముమ్మరం చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని