Omicron: పీఎం సార్‌.. ఇంకా ఎందుకు ఆలస్యం? విమానాలు ఆపండి..!

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనల మధ్య.. అంతర్జాతీయ విమానాలపై కేంద్రం ఆంక్షలు విధించాలని మంగళవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. గత ఏడాది కరోనా మొదటి దశ సమయంలో కూడా అంతర్జాతీయ విమాన ప్రయాణాలను నియంత్రించడంలో భారత్ ఆలస్యంగా స్పందించిందని ట్వీట్ చేశారు. 

Updated : 30 Nov 2021 17:01 IST

కొత్త వేరియంట్‌ నేపథ్యంలో కేంద్రానికి కేజ్రీవాల్ అభ్యర్థన

దిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనల మధ్య.. అంతర్జాతీయ విమానాలపై కేంద్రం ఆంక్షలు విధించాలని మంగళవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. గత ఏడాది కరోనా మొదటి దశ సమయంలో కూడా అంతర్జాతీయ విమాన ప్రయాణాలను నియంత్రించడంలో భారత్ ఆలస్యంగా స్పందించిందని ట్వీట్ చేశారు.

‘ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి ఇప్పటికే పలు దేశాలు విమాన రాకపోకలను నియత్రించాయి. మనం ఎందుకు ఆలస్యం చేస్తున్నాం? కరోనా మొదటి దశ సమయంలో కూడా అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు విధించడంలో ఆలస్యం చేశాం. పలు దేశాల నుంచి వచ్చే విమానాలు ఎక్కువ శాతం దిల్లీలోనే దిగుతాయి. దాంతో ఈ రాజధాని నగరంపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పీఎం సార్‌.. దయచేసి విమానాలు ఆపండి’ అంటూ ట్విటర్ వేదికగా కేజ్రీవాల్‌ ప్రధానిని అభ్యర్థించారు. అలాగే దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి చండీగఢ్‌లో కరోనా పాజిటివ్‌గా తేలిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆ వ్యక్తితో పాటుగా ఉన్న మరో ఇద్దరికి కూడా వైరస్‌ సోకింది. ప్రస్తుతం వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపారు.

గత వారం దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ను గుర్తించిన వెంటనే కేజ్రీవాల్‌ స్పందించిన సంగతి తెలిసిందే. ఆ వేరియంట్ భారత్‌లోకి రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఆ వేరియంట్ ప్రభావిత దేశాల నుంచి తక్షణమే విమానాల రాకపోకలను నిలిపివేయాలని అభ్యర్థించారు. ఇదిలా ఉండగా.. గతేడాది మార్చిలో నిలిపివేసిన అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని కేంద్రం పునరుద్ధరించే ప్రయత్నాల్లో ఉండగా.. ఒమిక్రాన్ కలవరం ఆటంకంగా మారింది. దాంతో ఆ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని