Nawab Malik: వాంఖడే గుట్టు ఎవరు బయటపెడతారో..?

డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టు సహా మరో ఐదు కేసులు ఎన్‌సీబీ ముంబయి పరిధి నుంచి బదిలీ అయిన సంగతి తెలిసిందే. వాటిని ఏజెన్సీకి చెందిన సెంట్రల్ యూనిట్ దర్యాప్తు చేయనుంది. దానిలో భాగంగా ప్రత్యేక బృందం(సిట్) శనివారం ముంబయికి రానుంది. మరోపక్క ఆర్యన్ కేసులో ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్ వాంఖడే సహకారం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 

Updated : 06 Nov 2021 22:26 IST

ముంబయి: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టు సహా మరో ఐదు కేసులు ఎన్‌సీబీ ముంబయి పరిధి నుంచి బదిలీ అయిన సంగతి తెలిసిందే. వాటిని ఏజెన్సీకి చెందిన సెంట్రల్ యూనిట్ దర్యాప్తు చేయనుంది. దానిలో భాగంగా ప్రత్యేక బృందం(సిట్) శనివారం ముంబయికి రానుంది. మరోపక్క ఆర్యన్ కేసులో ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్ వాంఖడే సహకారం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 

కేసు నుంచి తప్పించడంపై వాంఖడే ఏమన్నారంటే..

ఈ కేసు దర్యాప్తు నుంచి ఎన్‌సీబీ ముంబయి జోన్‌ అధికారి సమీర్‌ వాంఖడేను తొలగించారు. ఆయనపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు బాధ్యతల నుంచి తప్పిస్తూ ఎన్‌సీబీ డీజీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై సమీర్‌ వాంఖడే స్పందించారు. ‘ఆర్యన్ ఖాన్ కేసు, నవాబ్ మాలిక్ ఆరోపణలను కేంద్ర ఏజెన్సీతో విచారించాలని నేను అభ్యర్థించాను. అందుకు తగ్గట్టే దిల్లీకి చెందిన ప్రత్యేక బృందం ఈ కేసును విచారించనుంది. అలాగే మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్ కేసుపై కూడా దృష్టి సారించనుంది. ఈ దర్యాప్తులో భాగంగా దిల్లీ, ముంబయి ఎన్‌సీబీ బృందాలు సహకరించుకోనున్నాయి. ఇంకోవిషయం ఏంటంటే.. నేను ముంబయి ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్ పదవిలోనే ఉన్నాను. నన్ను ఆ ఉద్యోగం నుంచి తీసివేయలేదు’ అంటూ ఓ మీడియా సంస్థతో వాంఖడే అన్నారు

వాంఖడే గుట్టు ఎవరు బయటపెడతారో..

సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తన విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ‘డ్రగ్స్‌ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టు, అలాగే అతడి విడుదలకు భారీగా డబ్బు డిమాండ్ చేశారనే ఆరోపణపలపై సమీర్ దావూద్‌ వాంఖడేపై నేను సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాను. ఇప్పుడు కేంద్రరాష్ట్ర స్థాయుల్లో ఆయన్ను విచారించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ఆ రెండు బృందాల్లో వాస్తవాలను ఎవరు వెలుగులోకి తేస్తారో చూడాలి. అలాగే వాంఖడే దుర్మార్గపు ప్రైవేటు ఆర్మీని ఎవరు బయటపెడతారో చూడాలి’ అంటూ ట్వీట్ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని