Taliban Vs US: మా నిధులు మాకిచ్చేయండి.. లేకుంటే ప్రపంచానికే ముప్పు!

అఫ్గాన్‌కు చెందిన 9 బిలియన్‌ డాలర్ల (దాదాపు 66వేల కోట్లు) నిధులను వెంటనే విడుదల చేయాలని అమెరికాకు తాలిబన్లు మరోసారి విజ్ఞప్తి చేశారు.

Published : 18 Nov 2021 02:02 IST

అమెరికాకు తాలిబన్‌ ప్రభుత్వం లేఖ

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అంతర్జాతీయ మద్దతు పొందడంలో తాలిబన్లు విఫలమవుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఆర్థికంగా తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమకు చెందిన 9 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.66 వేల కోట్లు) నిధులను వెంటనే విడుదల చేయాలని అమెరికాకు తాలిబన్లు మరోసారి విజ్ఞప్తి చేశారు. శీతాకాలం వేళ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తమపై ఆంక్షలను ఎత్తివేయాలని కోరారు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే అఫ్గాన్‌ నుంచి భారీస్థాయిలో వలసలు పెరగడంతో పాటు ప్రపంచానికి మానవతా సంక్షోభాన్ని మిగులుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అఫ్గాన్‌ సెంట్రల్‌ బ్యాంకుకు చెందిన దాదాపు 9 బిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులను అమెరికా స్తంభింపజేసిన విషయం తెలిసిందే. వీటిని విడుదల చేయాలని అమెరికా ప్రభుత్వానికి తాలిబన్‌ ప్రభుత్వం తాజాగా లేఖ రాసింది. ‘అఫ్గాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన వెంటనే తమ సెంట్రల్‌ బ్యాంకు ఆస్తులను స్తంభింపజేయడంతో పాటు తమ బ్యాంకులపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. ఇది మేము ఊహించిన దానితోపాటు దోహా ఒప్పందానికి విరుద్ధంగా ఉంది’ అని తాలిబన్‌ విదేశాంగ మంత్రి అమీర్‌ ఖాన్‌ ముత్తఖీ పేర్కొన్నారు. ప్రస్తుతం అఫ్గాన్‌ ప్రజలు ఆర్థిక భద్రతకు సంబంధించి తీవ్ర సవాలు ఎదుర్కొంటున్నారని.. ప్రజల ఆస్తులను అమెరికా స్తంభింపజేయడం ఇక్కడి ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోందన్నారు. ఇలా నిధులను స్తంభింపజేయడం వల్ల ఎటువంటి సమస్యలకూ పరిష్కారం లభించదని అమెరికా ప్రభుత్వానికి రాసిన లేఖలో తాలిబన్లు స్పష్టం చేశారు.

వలసలతో ప్రపంచానికే సంక్షోభం..

‘శీతాకాలం సమీపిస్తున్న వేళ అఫ్గాన్‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్య, ఆరోగ్యంతో పాటు ఇతర సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా కరవు, మునుపటి యుద్ధం, కొవిడ్‌ ప్రభావం, బ్యాంకులపై ఆంక్షలు అఫ్గాన్‌ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. ఒకవేళ ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే తమ ప్రభుత్వంతోపాటు ఇక్కడి ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. తత్ఫలితంగా ప్రపంచంలోనే భారీ వలసలకు దారితీయడంతో పాటు ప్రపంచ మానవతా సంక్షోభాన్ని, ఆర్థిక సమస్యలకు మరింత కారణమవుతుందని ఆందోళన చెందుతున్నాం’ అని తాలిబన్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌ నిధులపై అమెరికా ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునపరిశీలించుకోవాలని తాలిబన్లు విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని