Afghan Military Jet: కుప్పకూలిన అఫ్గాన్‌ సైనిక విమానం..!

అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో అఫ్గాన్‌ మిలటరీకి చెందిన జెట్‌ విమానం ఉజ్బెకిస్థాన్‌లో కుప్పకూలిపోయింది.

Published : 16 Aug 2021 21:43 IST

సరిహద్దుల్లోకి అక్రమంగా ప్రవేశించడంతోనే దాడి చేశామన్న ఉజ్బెకిస్థాన్‌

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో అఫ్గాన్‌ మిలటరీకి చెందిన జెట్‌ విమానం ఉజ్బెకిస్థాన్‌లో కుప్పకూలిపోయింది. సరిహద్దు దాటి తమ దేశంలోకి ప్రవేశించడంతోనే భద్రతా దళాలు ఆ విమానంపై దాడి చేసినట్లు ఉజ్బెకిస్థాన్‌ రక్షణశాఖ వెల్లడించింది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరగగా.. ఆ విమానంలో ఎంతమంది ఉన్నారనే విషయంపై స్పష్టత లేదు.

‘అఫ్గాన్‌ వాయుసేనకు చెందిన విమానం మా దేశ సరిహద్దులను అక్రమంగా దాటే ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నం చేశాం. ఇందులో భాగంగానే అఫ్గాన్‌ విమానం కూలిపోయింది’ అని ఉజ్బెకిస్థాన్‌ రక్షణ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి బహ్రోమ్‌ జుల్ఫికోరోవ్‌ పేర్కొన్నారు. ఆ సమయంలో అఫ్గాన్‌ విమానంలో ఎంతమంది ఉన్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే, పైలట్‌ మాత్రం తప్పించుకొని గాయాలతో బయటపడినట్లు రష్యా మీడియా వెల్లడించింది.

అఫ్గాన్‌ నుంచి అమెరికా, నాటో బలగాలు వెళ్లిపోయిన స్వల్పకాలంలోనే దేశం మొత్తాన్ని తాలిబన్లు వశపరచుకున్నారు. అఫ్గాన్‌ రాజధాని కాబుల్‌ను నలువైపుల నుంచి చుట్టుముట్టి అధ్యక్ష భవనానికి చేరుకోవడంతో దేశం మొత్తం వారి హస్తగతమైంది. దీంతో ఏకంగా అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో వేల మంది అఫ్గాన్‌ పౌరులు దేశం విడిచి ఇతర దేశాలకు తరలిపోయే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఆదివారం ఒక్కరోజే తమ దేశ భూభాగంలోకి ప్రవేశించిన 84 మంది అఫ్గాన్‌ సైనికులను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఉజ్బెకిస్థాన్‌ ప్రకటించింది. అఫ్గాన్‌ సైనికులు వైద్య సహాయం కోరుతున్నట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని