Updated : 05/11/2021 16:18 IST

China: కరోనాపై ప్రశ్నించి.. మరణం అంచులకు చేరింది..!

చైనాలో ఓ జర్నలిస్టు పరిస్థితి ఇది..

బీజింగ్: చైనా ప్రభుత్వం తన పాలనను వ్యతిరేకించిన సొంత ప్రజలపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనకాడదని పలుమార్లు వెల్లడైంది. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా పుట్టినిల్లుగా భావిస్తోన్న వుహాన్‌ నగరంలో పరిస్థితుల్ని ప్రశ్నించిన ఓ సిటిజెన్ జర్నలిస్టు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు మరణం అంచుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించి జైలు పాలైన ఆమె.. తనకు విధించిన శిక్షను వ్యతిరేకిస్తూ జైల్లో నిరాహార దీక్ష చేస్తూ ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. దాంతో ఆమెను వెంటనే విడుదల చేయాలని హక్కుల సంఘాలు పిలుపునిస్తున్నాయి.

చైనాకు చెందిన ఝాంగ్‌జాన్ (38) గతంలో న్యాయవాదిగా పనిచేసేవారు. ఆమె 2020లో వుహాన్‌ నగరంలో పర్యటించారు. మహమ్మారికి కేంద్ర బిందువుగా భావిస్తోన్న ఆ నగరంలోని పరిస్థితుల్ని తన వీడియోల్లో బంధించేవారు. వైరస్ వ్యాప్తి, కట్టడికి తీసుకుంటున్న చర్యలపై అధికారుల్ని ప్రశ్నించేవారు. ఆ పాత్రికేయురాలి తీరు ప్రభుత్వాన్ని ఇరుకునపడేసేలా ఉండటంతో గతేడాది మేలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. రెచ్చగొట్టే చర్యల ద్వారా ఇబ్బందులు సృష్టిస్తున్నారనే నెపంతో డిసెంబర్‌లో ఆమెకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష కూడా పడింది. ప్రభుత్వంపై వచ్చే అసమ్మతిని అణచివేసేందుకు అక్కడి ప్రభుత్వం ఉపయోగించే చట్టాన్నే ఈమెపై ప్రయోగించి.. జైలు గోడలకు పరిమితం చేశారు.

అయితే ఝాంగ్‌జాన్ చాలా బలహీనంగా ఉన్నారని, ఇంకా ఎక్కువ కాలం బతకరంటూ ఆమె సోదరుడు ట్విటర్‌లో పోస్టు చేసిన వీడియో ద్వారా ఆమె పరిస్థితి వెలుగులోకి వచ్చింది. ‘ఈ చలికాలంలో ఆమె బతికే అవకాశం లేకపోవచ్చు’ అని ట్విటర్‌లో రాయడంతో పాటు జాగ్రత్తగా ఉండాలని తన సోదరికి సలహా ఇచ్చారు. దాంతో అక్కడి హక్కుల సంఘాలు ఆమెను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా చైనా ప్రభుత్వానికి ఇదే అభ్యర్థన చేసింది. ఆమెను విడుదల చేస్తే, వెంటనే నిరాహార దీక్ష మానివేస్తుందని వెల్లడించింది. ఇప్పుడామెకు వైద్యం చాలా అవసరమని తెలిపింది. ఆమెను జైల్లో పెట్టడం.. ‘మానవ హక్కులపై సిగ్గుమాలిన దాడి’ అని ఆమ్నెస్టీకి చెందిన కార్యకర్త ఒకరు వ్యాఖ్యానించారు. ఆలస్యం కాకముందే ఆమె విడుదలయ్యేలా చైనా ప్రభుత్వంపై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలని ఓ మీడియా సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. మరోపక్క షాంఘై మహిళా జైల్లో ఉన్న ఝాంగ్‌జాన్‌ను కలిసేందుకు ఆమె కుటుంబానికి అనుమతి దక్కడం లేదు. ఆహారం తీసుకోకుండా నిరసన వ్యక్తం చేస్తోన్న ఆమెకు.. బలవంతంగా ఆహారం అందిస్తున్నారని కొద్దికాలం క్రితం ఓ మీడియా సంస్థ వెల్లడించింది.

చైనాలోని వుహాన్‌ నగరమే కరోనాకు మూలమని ప్రపంచమంతా విశ్వసిస్తోంది. అందుకు తగ్గట్టే  గతేడాది ప్రారంభంలో ఆ నగరం వైరస్ ధాటికి వణికిపోయింది. దీంతో అక్కడి ప్రభుత్వం కఠినమైన కట్టడి చర్యలను అమలు చేసి, వైరస్‌కు చెక్ పెట్టామని ప్రకటించింది. ఆ సమయంలో ప్రపంచ దేశాలు వైరస్‌ తీవ్రతతో వణికిపోయాయి. దాంతో అక్కడి ప్రభుత్వం కరోనా కేసులు, మరణాల్ని కప్పిపుచ్చుతుందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ప్రశ్నించినవారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఝాంగ్‌జాన్ కూడా ఆ జాబితాలోకే వచ్చారు. ఆమెతో పాటు వుహాన్‌లో రిపోర్టింగ్ చేసిన నలుగురు సిటిజెన్‌ జర్నలిస్టుల్ని డ్రాగన్ ప్రభుత్వం అరెస్టు చేసింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని