Covid in Europe: డిసెంబర్‌ నాటికి మరో 2.3లక్షల మరణాలు!

ఈ ఏడాది డిసెంబర్‌ ఒకటోతేదీ నాటికి యూరప్‌లో మరో 2,36,000 కొవిడ్‌ మరణాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

Published : 30 Aug 2021 23:51 IST

హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

కొపెన్‌హగెన్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విలయతాండవం చేస్తూనే ఉంది. కొవిడ్‌-19ని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ వైరస్‌ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్‌ ఒకటోతేదీ నాటికి యూరప్‌లో మరో 2,36,000 కొవిడ్‌ మరణాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని ప్రపంచఆరోగ్యసంస్థ హెచ్చరించింది. అక్కడ చాలా దేశాల్లో కొవిడ్‌ నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ మందగించడం కూడా ఇందుకు కారణాలుగా పేర్కొంది.

‘యూరప్‌లో గతకొద్ది రోజులుగా వైరస్‌ విస్తృతి పెరుగుతూ వస్తోంది. యూరప్‌లోని 53దేశాల్లో దాదాపు 33 దేశాల్లో కొవిడ్ ఉద్ధృతి ఎక్కువకాగా.. గడిచిన రెండు వారాల్లోనే కేసుల సంఖ్య 10శాతం పెరిగింది. ముఖ్యంగా బాల్కన్స్‌, కాకసస్‌ వంటి ప్రాంతాల్లో కొవిడ్‌ మరణాల సంఖ్య అనూహ్యంగా ఎక్కువైంది. ముఖ్యంగా గత వారంలోనే కొవిడ్‌ మరణాల సంఖ్య 11శాతం పెరగడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ లెక్కన యూరప్‌లో డిసెంబర్‌ 1 నాటికి మరో 2.36లక్షల కొవిడ్‌ మరణాలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది’ అని ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) యూరప్‌ విభాగం డైరెక్టర్‌ హాన్స్‌ క్లూగే హెచ్చరించారు. ఇప్పటివరకు యూరప్‌లో 13లక్షల మంది కొవిడ్‌ మహమ్మారి బలయ్యారని తెలిపారు.

ఈ ప్రాంతంలో వైరస్‌ వ్యాప్తి రేటు ఈ విధంగా పెరగడం ఆందోళన కలిగించే విషయమని డబ్ల్యూహెచ్‌ఓ యూరప్‌ విభాగాధిపతి హాన్స్‌ క్లూగే పేర్కొన్నారు. ఇందుకు కేవలం డెల్టా వేరియంట్‌ మాత్రమే కాదని.. వేసవి ప్రయాణాలతో ప్రజలు గుంపులుగా తిరగడం, కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడం కూడా వైరస్‌ ఉద్ధృతి పెరగడానికి కారణాలని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా వ్యాక్సిన్ పంపిణీ మందగించడం కూడా మరో కారణంగా పేర్కొన్నారు. అందుకే వ్యాక్సిన్‌ ఉత్పత్తి పెంచడంతోపాటు వాటిని అందరికీ అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు చేయాలని డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని