WHO: అసాధారణ రీతిలో ఒమిక్రాన్‌ వ్యాప్తి..!

ఇప్పటివరకు వెలుగు చూసిన వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌ రకం అసాధారణ రీతిలో వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది.

Published : 15 Dec 2021 14:20 IST

అలసత్వం వహించవద్దని ప్రపంచ దేశాలకు హెచ్చరిక

జెనీవా: ఇప్పటివరకు వెలుగు చూసిన వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌ రకం అసాధారణ రీతిలో వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. ఇప్పటికే 77 దేశాలకు విస్తరించిన ఈ ఆందోళనకర వేరియంట్‌ త్వరలోనే మరిన్ని దేశాలకు వ్యాపించనుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు వైరస్‌ కట్టడికి తగు చర్యలు చేపట్టాలని సూచించింది.

‘ఆందోళనకర వేరియంట్‌ ఇప్పటికే 77 దేశాలకు విస్తరించింది. ఇదివరకు వెలుగు చూసిన వేరియంట్లలో చూడని విధంగా అసాధారణ రీతిలో వ్యాపిస్తోన్న ఈ వేరియంట్‌ త్వరలోనే చాలా దేశాలకు విస్తరించే అవకాశం ఉంది’ అని ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ గెబ్రెయేసస్‌ పేర్కొన్నారు. అందుకే ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మరోసారి ఉద్ఘాటించారు. అయితే, ఇది స్వల్ప వ్యాధి మాత్రమేనంటూ నిర్ధారణకు రావద్దని డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుడు బ్రూస్‌ అయిల్‌వార్డ్‌ హెచ్చరించారు. అలా అనుకుంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందన్నారు.

డెల్టా వేరియంట్‌తో పోలిస్తే కొత్తగా బయటపడిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ విస్తృత వేగంతో వ్యాపిస్తున్నట్లు ఇప్పటికే పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ వేరియంట్‌ వెలుగు చూసిన దక్షిణాఫ్రికాలో ఇప్పటికే సామాజిక వ్యాప్తి నెలకొన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అమెరికాలో బయటపడుతోన్న కేసుల్లో మూడుశాతం ఈ రకమే ఉంటున్నాయి. యూరప్‌లోనూ ఆస్పత్రి చేరికలు పెరుగుతుండగా.. ఇప్పటికే అక్కడ తొలి మరణం సంభవించింది. ఈ నేపథ్యంలో మరోసారి కఠిన ఆంక్షలు విధించే యోచనలో బ్రిటన్‌ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

ఇదిలాఉంటే, ఈ ఆందోళనకర వేరియంట్‌ను ఎదుర్కోవడంలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లు తక్కువ సామర్థ్యం కలిగివున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో తాజాగా ఫైజర్‌ రూపొందించిన యాంటీవైరల్‌ మాత్ర మాత్రం ఒమిక్రాన్‌ వేరియంట్‌పై సమర్థంగా పనిచేస్తోందని తుది ఫలితాల విశ్లేషణలో వెల్లడైంది. దీనితోపాటు మెర్క్‌ సంస్థ రూపొందించిన మరో ఔషధాన్ని కొవిడ్‌ చికిత్స కోసం అనుమతిచ్చే అంశంపై అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) త్వరలో ఓ నిర్ణయం తీసుకోనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని