International flights: తొందరపడొద్దు.. అంతర్జాతీయ విమానాలపై మరోసారి ఆలోచించండి

దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై శనివారం ఉదయం ప్రధాని నరేంద్రమోదీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు ఈ సమావేశం సాగింది. అలాగే దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది.

Published : 27 Nov 2021 19:40 IST

అధికారులకు మోదీ సూచన

దిల్లీ: దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై శనివారం ఉదయం ప్రధాని నరేంద్రమోదీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు ఈ సమావేశం సాగింది. అలాగే దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అధికారులతో పలు అంశాలపై చర్చించారని పీఎంఓ వెల్లడించింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలను సడలించే ప్రణాళికను పున:సమీక్షించాలని ఈ సందర్భంగా ఆయన అధికారులకు సూచించారు. 

అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని పునః ప్రారంభించే అంశంపై శుక్రవారం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభణ నేపథ్యంలో గతేడాది మార్చి నుంచి రద్దు చేసిన అంతర్జాతీయ విమాన కమర్షియల్‌ పాసింజర్‌ సర్వీసుల్ని డిసెంబర్‌ 15 నుంచి పునరుద్ధరించనున్నట్టు ప్రకటించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో పాటు విదేశాంగ, ఆరోగ్య శాఖలతో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు డీజీసీఏ తెలిపింది. అయితే, యూకే, సింగపూర్‌, చైనా, బ్రెజిల్‌, బంగ్లాదేశ్, మారిషస్‌, జింబాబ్వే, న్యూజిలాండ్‌తో పాటు కొవిడ్‌ కొత్త వేరియంట్‌ కలకలం రేపుతున్న దేశాలైన దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, ఇజ్రాయిల్‌, హాంకాంగ్‌ వంటి మొత్తం 14 దేశాలకు మాత్రం పరిమితమైన సేవలు కొనసాగించనున్నట్టు పేర్కొంది. మరోపక్క భారత్ ఇప్పటికే పర్యాటక వీసాల జారీ ప్రక్రియను కూడా ప్రారంభించింది. 

ఆ ప్రకటనపై మరోసారి ఆలోచించాలి: మోదీ

ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో శనివారం జరిగిన సమావేశంలో ఈ ప్రకటనపై మోదీ మాట్లాడారు. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షల సడలింపు గురించి మరోసారి ఆలోచించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ వేరియంట్‌ను కట్టడిచేసే ఉద్దేశంతో బ్రిటన్‌ ఇప్పటికే ఆఫ్రికా దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధించింది. జర్మనీ, ఇటలీ, సింగపూర్, జపాన్, యూఎస్‌కూడా ఆ దిశగా చర్యలు చేపట్టాయి. దక్షిణాఫ్రికా తదితర దేశాల నుంచి వచ్చేవారిపై ప్రయాణ ఆంక్షలు విధించేందుకు ఈయూ సభ్య దేశాలు అంగీకారం తెలిపాయి. మనదేశంలో కూడా పలు రాష్ట్రాలు ఈ దిశగా ఆలోచన చేశాయి. దీనిపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే కేంద్రానికి అభ్యర్థన చేశారు. కొత్త వేరియంట్ ప్రభావిత దేశాల నుంచి తక్షణమే విమానాల రాకపోకలను నిలిపివేయాలని ట్విటర్ వేదికగా కోరారు. అలాగే దక్షిణాఫ్రికా నుంచి ముంబయి విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికులకు క్వారంటైన్ విధిస్తున్నట్లు నగర మేయర్ కిశోరీ పెడ్నేకర్ ప్రకటించారు. 

జీనోమ్ సీక్వెన్సింగ్‌ను విస్తృతం చేయాలి..

కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతున్నందున ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి పలు కొవిడ్ నియమాలను పాటించాలని ఈ సమావేశంలో ప్రధాని సూచించారు. ప్రమాదం పొంచి ఉన్న దేశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అక్కడి నుంచి వచ్చే ప్రయాణికుల్ని పరీక్షించాలని తెలిపారు. కరోనా వైరస్‌లో ఉత్పరివర్తనాలను గుర్తించే జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియ గురించి అధికారులు మోదీకి వివరించారు. ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రక్రియను మరింత విస్తృతం చేయాలని ప్రధాని వారికి సూచించారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో కంటైన్మెంట్ చర్యలు అమలు చేయాలని, నిఘా పెంచాలని వెల్లడించారు. ఇప్పటికే కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నవారికి రెండో డోసు ఇచ్చేలా చర్యల్ని వేగవంతం చేయాలని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని