Afghanistan: కాబుల్‌లో మహిళా ఉద్యోగులపై ఆంక్షలు.. ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు

అఫ్గాన్‌లో తాలిబన్ల పాలనలో మహిళల హక్కులపై ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే కేబినెట్‌లో వారికి చోటివ్వని తాలిబన్లు.. క్రమంగా విద్య, ఉద్యోగ తదితర రంగాల్లోనూ కట్టడి చేస్తున్నారు. తాజాగా కాబుల్‌ నగరపాలక సంస్థలో...

Published : 20 Sep 2021 01:42 IST

కాబుల్‌: అఫ్గాన్‌లో తాలిబన్ల పాలనలో మహిళల హక్కులపై ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే కేబినెట్‌లో వారికి చోటివ్వని తాలిబన్లు.. క్రమంగా విద్య, ఉద్యోగ తదితర రంగాల్లోనూ కట్టడి చేస్తున్నారు. తాజాగా కాబుల్‌ నగరపాలక సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగులపై ఆంక్షలు విధించారు. నగరవ్యాప్తంగా విధులు నిర్వహించే మహిళా ఉద్యోగులు ఇళ్లకే పరిమితం కావాలని తాత్కాలిక మేయర్‌ హమ్‌దుల్లా నమోనీ ఆదేశించారు.  ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పురుషులకు అనుమతి లేని విధుల్లో ఉండే మహిళలకు మాత్రం మినహాయింపు ఉందని వెల్లడించారు. మహిళల పబ్లిక్‌ టాయిలెట్ల నిర్వహణ తదితర పనులు ఇందులోకి వస్తాయని చెప్పారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగుల విషయమై తుది నిర్ణయం రావాల్సి ఉందన్నారు. 

ఇదివరకు మూడు వేల మంది..

ఇటీవల తాలిబన్ల ఆక్రమణకు ముందు వరకు.. నగరవ్యాప్తంగా అన్ని విభాగాల్లో కలిపి దాదాపు మూడు వేల మంది మహిళలు పని చేసేవారని మేయర్‌ చెప్పారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే స్థానికంగా మహిళలు, బాలికలపై విరుచుకుపడుతున్న తాలిబన్లు.. శనివారం గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన మహిళా మంత్రిత్వశాఖ భవనంలోకి చొరబడి, అక్కడి సిబ్బందిని బయటికి పంపేసిన విషయం తెలిసిందే. ఈ భవనంలో ఇటీవల కొత్తగా ప్రకటించిన ధర్మ ప్రచార మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని