Haibatullah Akhundzada: తొలిసారి బయటకు వచ్చిన తాలిబన్‌ అధినేత!

తమ సుప్రీం లీడర్‌ హైబతుల్లా అఖుండ్‌ జాదా తొలిసారి ప్రజల ముందుకు వచ్చారని తాలిబన్లు ఆదివారం ప్రకటించారు...

Published : 31 Oct 2021 11:56 IST

ప్రకటించిన తాలిబన్‌ వర్గాలు

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కొత్త సర్కార్‌కు ప్రధాని హోదాలో తాలిబన్ల సుప్రీం లీడర్‌ హైబతుల్లా అఖుండ్‌ జాదా నేతృత్వం వహిస్తున్నారు. కానీ, అధికారంలోకి వచ్చినా ఇప్పటి వరకు ఆయన ఎక్కడా బయటకు కనిపించకపోవడం అనేక అనుమానాలకు తెరలేపింది. ఈ నేపథ్యంలో ఆదివారం తాలిబన్లు కీలక ప్రకటన చేశారు. తమ నేత అఖుండ్‌ జాదా ప్రజల మధ్యకు వచ్చారని వెల్లడించారు.

తాలిబన్ల మద్దతుదారులను ఉద్దేశించి అఖుండ్‌ జాదా ప్రసంగించారని తాలిబన్‌ వర్గాలు ఆదివారం ప్రకటించాయి. కాందహార్‌లోని దారుల్‌ ఉలుం హకిమా మదర్సాలో ఆయన మాట్లాడారని పేర్కొన్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయన అక్కడకు చేరుకున్నారని తెలిపారు. అయితే, అందుకు సంబంధించిన చిత్రాలుగానీ, వీడియోలుగానీ విడుదల చేయలేదు. కానీ, ఆ ప్రసంగంలోని 10 నిమిషాల నిడివి గల కొంత భాగాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అయితే, ఆయన మాటల్లో ఎక్కడా రాజకీయాలు, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు లేవని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. కేవలం తాలిబన్ల నాయకత్వానికి దేవుడి ఆశీస్సులు ఉంటాయని మాత్రమే అన్నట్లు తెలుస్తోంది. సవాళ్లు ఎదుర్కొంటున్న అఫ్గాన్‌కు విజయం వరించాలని ప్రార్థించినట్లు సమాచారం.

అధికారంలోకి వచ్చినా తాలిబన్‌ అధినాయకుడు హైబతుల్లా అఖుండ్‌ జాదా అజ్ఞాతం నుంచి ఇన్నాళ్లూ బయటకు రాలేదు. ఇంతకుముందు కూడా ఆ నేత ఎన్నడూ ఎవరికీ కనిపించేవాడు కాదు. తాలిబన్లు ఆ మధ్య ఆయన ఛాయాచిత్రం విడుదల చేసేవరకు అతని రూపురేఖలు కూడా బయటి ప్రపంచానికి తెలియవు. అఖుండ్‌ జాదా మొదటి నుంచీ కాందహార్‌లోనే ఉంటున్నాడనీ, త్వరలోనే ప్రజల్లోకి వస్తాడని తాలిబన్‌ ప్రతినిధి ఒకరు గతంలో వెల్లడించారు. అఖుండ్‌ మొదటినుంచీ మతపరమైన కార్యకలాపాల్లో నిమగ్నమవుతూ అజ్ఞాతంలోనే ఉంటున్నాడు. తాలిబన్‌ సంస్థాపకుడు ముల్లా మహమ్మద్‌ ఒమర్‌ అకాల మరణం చెందిన విషయం 2015లో బయటకు వచ్చింది. ఆ స్థానాన్ని ముల్లా మన్సూర్‌ అఖ్తర్‌ భర్తీ చేశాడు. 2016లో అఖ్తర్‌ను డ్రోన్‌ దాడి ద్వారా అమెరికా అంతమొందించాక, నాయకత్వం కోసం తాలిబన్‌ వర్గాల మధ్య కుమ్ములాట చోటు చేసుకుంది. సమైక్యంగా నడపగల నాయకుడి కోసం మొదలైన అన్వేషణ అఖుండ్‌ జాదా ఎంపికతో ముగిసింది. అంతవరకు అమెరికా బారి నుంచి తప్పించుకోవడానికి ఆ నాయకుడు రహస్య జీవితం గడిపేవాడు. మతపరమైన సందేశాలు వెలువరించడం మినహా జనంలోకి వచ్చిందే లేదు.

దీంతో జాదాకు కరోనా సోకిందనీ, ఆరోగ్యం బాగాలేదనీ గతంలో వదంతులు వ్యాపించాయి. కొందరైతే బాంబు పేలుడులో ఆ నాయకుడు మరణించినట్లు ప్రచారం చేశారు. అయితే, అవేవీ నిజం కావని తేలిపోయింది. అధికారం చేజిక్కిన తర్వాత అఫ్గాన్‌లో వివిధ తెగలు, వర్గాలు ఘర్షణకు దిగే ప్రమాదం ఉందని.. వీరందరినీ సమన్వయపరచడానికి అఖుండ్‌ జాదా జనం ముందుకు రాక తప్పకపోవచ్చన్న విశ్లేషణలు వెలువడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని