Afghanistan: తాలిబన్ల కొత్త ప్రభుత్వం.. ప్రధానిగా మహమ్మద్‌ హసన్‌!

అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు మధ్యంతర ప్రభుత్వాన్ని ప్రకటించారు. తమ ప్రభుత్వానికి......

Updated : 07 Sep 2021 21:41 IST

కాబుల్‌: ఇటీవల అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకొని అక్కడ పెను సంక్షోభం సృష్టించిన తాలిబన్లు మంగళవారం రాత్రి మధ్యంతర ప్రభుత్వాన్ని ప్రకటించారు. తమ కొత్త ప్రభుత్వానికి ముల్లా మహమ్మద్‌ హసన్‌ అకుంద్‌ సారథ్యం వహిస్తారని తెలిపారు. ఈ మేరకు తాలిబన్ల ముఖ్య అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ మీడియాతో మాట్లాడారు. దేశ ఉప ప్రధానిగా తాలిబన్ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ వ్యవహరిస్తారని స్పష్టంచేశారు. వీరితో పాటు అఫ్గాన్‌ను తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు కొనసాగించిన ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కొంతమంది నేతలను కీలక పదవుల్లో నియమించారు. తాలిబన్‌ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌ తనయుడు ముల్లా యాకుబ్‌ను రక్షణ మంత్రిగా, సిరాజుద్దీన్‌ హక్కానీని అంతర్గత వ్యవహారాల మంత్రిగా నియమించినట్టు తెలిపారు. అయితే, కేబినెట్‌ ఏర్పాటు ఇంకా పూర్తి కాలేదని, ఇది తాత్కాలికమైందేనని ముజాహిద్‌ స్పష్టంచేశారు. 

మరోవైపు, ఆగస్టు 15న కాబుల్‌ను ఆక్రమించడం ద్వారా తాలిబన్లు  అఫ్గానిస్థాన్‌ను తమ ఆక్రమణలోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో గత 20 ఏళ్ల తాలిబన్ల రాక్షస పాలనను గుర్తు చేసుకున్న ప్రజలు అఫ్గాన్‌ను విడిచి పారిపోయేందుకు ప్రయత్నించిన క్రమంలో కాబుల్‌ విమానాశ్రయం వద్ద చోటుచేసుకున్న హృదయవిదారక దృశ్యాలు యావత్‌ ప్రపంచాన్ని కలిచివేశాయి. అమెరికా సహా పశ్చిమ దేశాలు అక్కడి ప్రజల్ని యుద్ధప్రాతిపదికన తరలించడంతో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను ముమ్మరం చేసిన తాలిబన్లు.. తాజాగా మధ్యంతర ప్రభుత్వాన్ని ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని