Taiwan: సైనికాధికారులతో జిన్‌పింగ్‌ భేటీ.. తైవాన్‌పైకి యుద్ధవిమానాలు..!

చైనా-తైవాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా ఆదివారం 27 చైనా విమానాలు ఎయిర్‌ డిఫెన్స్‌ ఐడెంటిఫికేషన్‌ జోన్‌లోకి ప్రవేశించాయి. వీటిల్లో భారీ బాంబర్లతోపాటు, ట్యాంకర్‌ విమానాలు కూడా ఉన్నాయి

Updated : 29 Nov 2021 15:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా-తైవాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా ఆదివారం 27 చైనా విమానాలు ఎయిర్‌ డిఫెన్స్‌ ఐడెంటిఫికేషన్‌ జోన్‌లోకి ప్రవేశించాయి. వీటిల్లో భారీ బాంబర్లతోపాటు, ట్యాంకర్‌ విమానాలు కూడా ఉన్నాయి. ఈ సారి ఫిలిప్పీన్స్‌-తైవాన్‌ మధ్య మార్గం నుంచి దీనిలోకి ప్రవేశించాయి. వీటిల్లో 18 ఫైటర్‌ జెట్‌లు, ఐదు హెచ్‌-6 బాంబర్లు, వై-20 ఏరియల్‌ రిఫ్యూలింగ్‌ ట్యాంకర్‌ ఉన్నట్లు తైవాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ  ఘటన జరిగిన వెంటనే తైవాన్‌ యుద్ధవిమానాలు గాల్లోకి ఎగిరాయి. అవి చైనా యుద్ధవిమానాలను హెచ్చరించాయి.

మరోపక్క చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సైనిక అధికారులతో మూడురోజులపాటు భేటీ అయ్యారు. ఆ భేటీ ఆదివారం ముగిసిన వెంటనే విమానాల చొరబాటు చోటు చేసుకోవడం గమనార్హం. ఈ భేటీ సందర్భంగా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీని శాస్త్రసాంకేతిక అంశాలతో ఎలా శక్తిమంతం చేయాలనే విషయంపై జిన్‌పింగ్‌ చర్చించినట్లు షినోవా న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. ‘‘వాస్తవిక అనుభవాన్ని సంపాదించుకొని.. సైనికులు, అధికారులను ప్రోత్సహించి అన్ని రకాల పరిస్థితులకు అలవాటు పడి బలోపేతం అయ్యేట్లు చూడాలి’’ అని జిన్‌పింగ్‌ చెప్పినట్లు అక్కడి పత్రికలు పేర్కొన్నాయి.

తైవాన్‌ రక్షణ బడ్జెట్‌ మొత్తం ఆహుతి..!

చైనా యుద్ధవిమానాలను తరిమేందుకు తైవాన్‌ రక్షణ బడ్జెట్‌లో భారీ మొత్తం వృథా అవుతోంది. చైనా విమానాల చొరబాట్లను ఎదుర్కొనేందుకు మొత్తం రక్షణ బడ్జెట్‌లో 8 శాతం వెచ్చించినట్లు తైవాన్‌ రక్షణశాఖ మంత్రి యెన్‌ డె ఫా గత అక్టోబర్‌లో వెల్లడించారు. చైనా యుద్ధవిమానాలు ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి 217 సార్టీలను నిర్వహించగా.. 49సార్లు తైవాన్‌ ఏడీఐజెడ్‌లోకి ప్రవేశించేందుకు యత్నించాయి. ఈ క్రమంలో తైవాన్‌ వాయుసేన, నావికాదళం 3000 సార్టీలను నిర్వహించాల్సి వచ్చింది. ఇందుకోసం మొత్తం 886 మిలియన్‌డాలర్లను వెచ్చించాల్సి వచ్చింది.

చైనా 2,972 సార్లు హద్దుమీరినట్లు తైవాన్‌ పేర్కొంది. ఈ క్రమంలో వాటిని అడ్డుకోవడానికి తైవాన్‌ యుద్ధవిమానాలను పంపాల్సి వచ్చింది. ఇందుకుగాను 886.49 మిలియన్‌ డాలర్లు ఖర్చుపెట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని