Taiwan: ఈ ‘సిలికాన్‌ షీల్డ్‌’ ఏమిటీ.. తైవాన్‌ను ఎలా రక్షిస్తోంది..?

అమెరికా-చైనా మధ్య తైవాన్‌ విషయంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా జరిగిన చర్చల్లో షీజిన్‌పింగ్‌ హెచ్చరికలతో ఇది పూర్తిగా బహిర్గతమైంది. తైవాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోను సామ,దాన,భేద దండోపాయాలను వాడి కలిపేసుకోవాలని చూస్తోంది.

Updated : 17 Nov 2021 13:16 IST

 టీఎస్‌ఎంసీనే ఆ చిరు ద్వీపానికి కవచం 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

అమెరికా-చైనా మధ్య తైవాన్‌ విషయంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా జరిగిన చర్చల్లో చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌ హెచ్చరికలతో ఇది పూర్తిగా బహిర్గతమైంది. తైవాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సామ,దాన,భేద దండోపాయాలను వాడి కలిపేసుకోవాలని డ్రాగన్‌ చూస్తోంది. ఈ చర్యలు.. ప్రపంచం మొత్తాన్ని అస్థిరపర్చే ప్రమాదం ఉంది. ఈ కంప్యూటర్‌ యుగంలో కార్ల నుంచి యుద్ధవిమానాల వరకూ వినియోగించే సిలికాన్‌ చిప్‌లు ఇక్కడే అత్యధికంగా తయారవుతాయి. ఈ నేపథ్యంలో తైవాన్‌ అస్థిరపడితే ప్రపంచం మొత్తం ఆ ఫలితాన్ని అనుభవించాల్సి ఉంది. ఇప్పటికే తీవ్రమైన చిప్‌ల కొరతతో ప్రపంచం ఇబ్బంది పడుతోంది. ఈ డిమాండ్‌ను అందుకోవడానికి కొన్నేళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో ‘సిలికాన్‌ షీల్డ్‌’ తైవాన్‌ను రక్షిస్తుందా..?  చైనా దూకుడును తట్టుకోవడానికి జరుగుతోన్న ప్రయత్నాలేమిటీ..?

సిలికాన్‌ షీల్డ్‌ ఏమిటీ..?

కండక్టర్స్‌, ఇన్సులేటర్ల మధ్య ఉండే చిప్స్‌ (సెమీకండక్టర్స్‌)ను ఎలక్ట్రానిక్‌ వస్తువుల బ్రెయిన్‌తో పోలుస్తారు. ప్రస్తుతం రోజువారీ జీవితంలో ప్రపంచం మొత్తానికి వీటి అవసరం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సెమీకండక్టర్లను తయారు చేసే సంస్థ టీఎస్‌ఎంసీ(తైవాన్‌ సెమీకండక్టర్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ కంపెనీ)నే . ఒకప్పుడు అమెరికా ఆధిపత్యం ఉన్న ఈ మార్కెట్‌ మెల్లగా తైవాన్ వైపు మొగ్గింది. పది నానోమీటర్ల లోపు సైజు అత్యాధునిక చిప్‌ల తయారీలో 84శాతం వాటాతో టీఎస్‌ఎంసీనే రారాజుగా నిలిచింది . ట్రెండ్‌ఫోర్స్‌ డేటా ప్రకారం 2020 మూడో త్రైమాసికం నాటికి ప్రపంచంలోని 53.9శాతం సెమీకండక్టర్లను టీఎస్‌ఎంసీ తయారు చేస్తోంది. తైవాన్‌పై అత్యధికంగా ఆధారపడిన దేశాల్లో చైనా కూడా ఒకటి. దీంతో చైనా కనుక దాడి చేస్తే.. అనంతరం సెమీ కండక్టర్‌ పరిశ్రమలో తలెత్తే తీవ్ర పరిణామాలను చైనా కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. బలప్రయోగం చేస్తామని చైనా చాలా ఏళ్లుగా బెదిరిస్తున్న వెంటనే దాడికి యత్నించకపోవడానికి కారణం కూడా ఇదే.  దీనికి తోడు టీఎస్‌ఎంసీ విదేశాల్లో సెమీకండకర్ల ఫౌండ్రీలను (తయారీ కర్మాగారాలను) విస్తరిస్తోంది.

అమెరికా గుండెకాయ తైవాన్‌లో..

‘ది సెంటర్‌ ఫర్‌ ఎ న్యూ అమెరికన్‌ సెక్యూరిటీ’ సంస్థలో సీనియర్‌ పరిశోధకుడు మార్టిజన్‌ రాస్సెర్‌ అంచనా ప్రకారం చిప్స్‌ డిజైన్‌, ఉత్పత్తిని ఎవరు గుప్పిట పెట్టుకొంటారో.. వారే 21వ శతాబ్దం భవిష్యత్తును నిర్దేశిస్తారు. అమెరికాలోని యాపిల్‌, న్విడియా, క్వాల్‌ కామ్‌ వంటి దిగ్గజాలు తైవాన్‌ పరిశ్రమపైనే ఆధారపడి ఉన్నాయి. అమెరికా టెక్నాలజీ కంపెనీలు వినియోగించే 90 శాతం చిప్స్‌ తైవాన్‌ నుంచే వెళతాయి. ఒక్కసారి ఈ పరిశ్రమ ఒడిదొడుకులను ఎదుర్కొంటే  వాటిల్లే నష్టం 490 బిలియన్‌ డాలర్ల వరకు ఉంటుంది. తైవాన్‌ ఆక్రమణతో తలెత్తే భారీ ఆర్థిక, రాజకీయ మూల్యాలను తప్పించేందుకు.. అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. అందుకే తైవాన్‌ను రక్షించేందుకు ఇతర దేశాలను కూడా ప్రోత్సహిస్తోంది.

‘సిలికాన్‌ షీల్డ్‌’పై ఆందోళనలో డ్రాగన్‌..!

తైవాన్‌ను ప్రపంచంలో చాలా దేశాలు గుర్తించడంలేదు. కానీ, సిలికాన్‌ చిప్‌ల కారణంగా దానికి ఉన్న పలుకుబడి మాత్రం చాలాఎక్కువ. ఇదే ఆ దేశాన్ని రక్షించేందుకు ‘సిలికాన్‌ షీల్డ్‌’లా కాపాడుతోంది. ‘సిలికాన్‌ షీల్డ్‌’ అనే పదాన్ని  క్రెయిగ్‌ ఆడిసన్‌ అనే రచయిత తొలిసారి ప్రయోగించాడు. అతను ‘సిలికాన్‌ షీల్డ్‌: తైవాన్స్‌ ప్రొటెక్షన్‌ ఎగైనెస్ట్‌ చైనీస్‌ అటాక్‌’ అనే పుస్తకంలో వాడారు. సెమీకండక్టర్ల విషయంలో తైవాన్‌ ఎదిగే కొద్దీ చైనా దూకుడుకు కళ్లెం పడుతుంటుందని అభిప్రాయపడ్డారు. కాకపోతే టీఎస్‌ఎంసీ తన పోటీదారుల కంటే ఎప్పుడూ ముందుండాల్సిందే. చైనాలో కూడా తైవాన్‌ నుంచి వెళ్లే చిప్స్‌ను ఎక్కువగా వినియోగిస్తారు.

శాంతియుత మార్గంలో తైవాన్‌ విలీనం జరగాలంటే చైనా అనుకూల ప్రభుత్వం అక్కడ ఉండాలి. తైవాన్‌లో ప్రజాస్వామ్య బద్ధంగా జరిగే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు చైనా తరచూ ప్రయత్నించేది అందుకే. 

* చైనా దాడి చేసి ఆక్రమిస్తే తైవాన్‌లోని విద్యావ్యవస్థలో బలమైన మార్పులు జరుగుతాయి. దీంతో టీఎస్‌ఎంసీకి అవసరమైన ఉద్యోగులు దొరక్కపోవచ్చు. విదేశీ నాగరికులు చైనా పాలనలో పనిచేయడానికి ఆసక్తి చూపకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి.

* మరోపక్క సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన పరికరాలు జపాన్‌, అమెరికా నుంచే అత్యధికంగా తైవాన్‌కు వస్తాయి. వీటి విలువ 2020లో 18 బిలియన్‌ డాలర్లు ఉంది. అంతేకాదు మేధోహక్కులు, మెషినరీ, కెమికల్స్‌ కోసం విదేశాలపై ఆధారపడాలి. తైవాన్‌ ఆక్రమణ జరిగితే ఈ సరఫరా నిలిచిపోయి టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ కాదు. ప్రస్తుతం చైనా పరిధిలోని ఎస్‌ఎంఐసీ ఇటువంటి సమస్యనే ఎదుర్కొంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని