‘మానసికంగా అలసిపోయా.. ఏకాంతంలోకి వెళ్తున్నా’: మహారాష్ట్ర ఎంపీ

మనిషికి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. దాన్ని కాపాడుకునేందుకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు అవసరం! తాజాగా ఇదే కారణంతో.. మహారాష్ట్రకు చెందిన ఓ ఎంపీ తాను ఏకాంతంలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. మానసిక, శారీరక ఒత్తిడి కారణంగా అలసిపోయినట్లు తెలిపారు...

Published : 09 Nov 2021 01:31 IST

ముంబయి: మనిషికి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. దాన్ని కాపాడుకునేందుకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు అవసరం! తాజాగా ఇదే కారణంతో.. మహారాష్ట్రకు చెందిన ఓ ఎంపీ తాను ఏకాంతంలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. మానసిక, శారీరక ఒత్తిడి కారణంగా అలసిపోయినట్లు తెలిపారు. ఆయనే పుణె జిల్లాలోని శిరూర్ నియోజకవర్గానికి చెందిన ఎన్సీపీ ఎంపీ అమోల్ కోల్హే. ఆయన నటుడు కూడా. గతంలో తాను తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఏకాంత సమయంలో సమీక్షించుకుంటానని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో ఆయన ఓ పోస్టు పెట్టారు.

‘అవలోకానికి సమయమిది. కొన్నేళ్లుగా.. తెలియకుండానే పరుగులు పెడుతున్నా! ఈ క్రమంలో కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్నా. ఊహించని అడుగులు వేశా. ఇవన్నీ చేస్తున్నప్పుడు చాలా బ్యాలెన్సింగ్‌గా వ్యవహరించాల్సి వచ్చింది. టైమ్ మేనేజ్‌మెంట్ తప్పలేదు. దీంతో ఒత్తిడికి లోనయ్యా. మానసికంగా, శారీరకంగా అలసిపోయా’ అని రాసుకొచ్చారు. ఈ మానసిక అలసట నుంచి బయటపడేందుకు ధ్యానం, చింతన అవసరమని.. అందుకోసమే ఏకాంతంలోకి వెళ్తున్నట్లు తెలిపారు. త్వరలో కొత్త ఉత్సాహంతో మళ్లీ కలుద్దామని పేర్కొన్నారు. చివర్లో ‘చింతన కోసమే వెళ్తున్నా.. చింతన శిబిరం (రాజకీయ శిబిరం) కోసం కాద’ని చమత్కరించారు. దీనిపై నెటిజన్లు, ఆయన మద్దతుదారులూ సానుకూలంగా స్పందించారు. అమోల్‌ 2019 లోక్‌సభ ఎన్నికల్లో శివసేన అభ్యర్థిపై విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని