Lok Sabha: ‘ఆక్సిజన్‌ కొరతపై నేటికీ రాజకీయాలా!’

దేశంలో సెకండ్‌ వేవ్‌ సమయంలో ఏర్పడిన ఆక్సిజన్ కొరత సమస్యపై నేటికీ రాజకీయాలు చేయడం మానుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రతిపక్షాలను కోరారు. పెరిగిన ఆక్సిజన్‌ డిమాండ్‌ను అందుకునేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలను గమనించాలన్నారు...

Published : 03 Dec 2021 23:47 IST

దిల్లీ: దేశంలో సెకండ్‌ వేవ్‌ సమయంలో ఏర్పడిన ఆక్సిజన్ కొరత సమస్యపై నేటికీ రాజకీయాలు చేయడం మానుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రతిపక్షాలను కోరారు. పెరిగిన ఆక్సిజన్‌ డిమాండ్‌ను అందుకునేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలను గమనించాలన్నారు. శుక్రవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎంపీ సురేష్ ధనోర్కర్ లేవనెత్తిన అంశంపై మంత్రి మాట్లాడుతూ.. కరోనా ఉద్ధృతి సమయంలో సరిపడ ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందని, ఉత్పత్తినీ పెంచిందని గుర్తుచేశారు. దురదృష్టవశాత్తూ.. అటువంటి పరిస్థితుల్లోనూ చాలా మంది రాజకీయాలు చేయడం మానుకోలేదని విమర్శించారు. ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదని పేర్కొన్నారు.

పంజాబ్‌ మాత్రమే వెల్లడించింది..

సెకండ్‌ వేవ్‌ సమయంలో ఆక్సిజన్ కొరత కారణంగా మరణాలు సంభవించాయనే ప్రతిపక్షాల వాదనలను మాండవీయ కొట్టిపారేశారు. ఆక్సిజన్ కొరత కారణంగా మరణించిన వారి వివరాలు సమర్పించాలని కోరుతూ కేంద్రం మూడుసార్లు రాష్ట్రాలకు లేఖలు రాసిందని.. 19 రాష్ట్రాలు స్పందించాయని, కేవలం పంజాబ్ మాత్రమే ఈ తరహా నాలుగు అనుమానాస్పద మరణాలు నమోదైనట్లు తెలిపిందని చెప్పారు. ఆక్సిజన్‌ కొరతతో సంభవించిన మరణాల సంఖ్యను దాచాల్సిన అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ సైతం ముఖ్యమంత్రులకు చెప్పారని, కానీ.. ఇప్పటికీ, ఈ విషయంపై రాజకీయాలు జరుగుతున్నాయని మంత్రి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని