metaverse: మెటావర్స్‌లో 2.5 మిలియన్‌ డాలర్లతో వర్చువల్‌ ప్లాట్‌ కొనుగోలు..!

వర్చువల్‌ ప్రపంచమైన మెటావర్స్‌లో ప్లాట్ల విక్రయాలు కూడా మొదలుపెట్టారు. తాజాగా వీటిల్లో 2.5 మిలియన్‌ డాలర్లను వెచ్చించి కెనడాకు చెందిన ఓ సంస్థ వర్చువల్‌ ప్లాట్‌ను కొనుగోలు చేసింది.

Published : 30 Nov 2021 01:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వర్చువల్‌ ప్రపంచమైన మెటావర్స్‌లో ప్లాట్ల విక్రయాలు కూడా మొదలుపెట్టారు. తాజాగా వీటిల్లో 2.5 మిలియన్‌ డాలర్లను వెచ్చించి కెనడాకు చెందిన ఓ సంస్థ వర్చువల్‌ ప్లాట్‌ను కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన చెల్లింపులు కూడా క్రిప్టో కరెన్సీలోనే చేసింది. ఇప్పటి వరకూ మెటావర్స్‌లో జరిగిన అతిపెద్ద కొనుగోలు ఇదే. 

కెనడాకు చెందిన డిసెంట్రలైజ్‌డ్‌ ఫినాన్స్‌ సేవలు అందించే టోకెన్‌.కామ్‌ అనే సంస్థ డిసెంట్రల్యాండ్‌ అనే సంస్థ నుంచి ఈ వర్చువల్‌ ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. డిసెంట్రాల్యాండ్‌ సంస్థ మెటావర్స్‌ సాంకేతికత ఆధారంగా క్రిప్టోకరెన్సీలను వినియోగించి వర్చువల్‌ ల్యాండ్‌ విక్రయాలతో సహా ఇతర సేవలను అందిస్తోంది. కొనుగోలు చేసిన ఈ వర్చువల్‌ స్థలంలో మెటావర్స్‌ సాంకేతికత ఆధారంగా ఫ్యాషన్‌ షోలు నిర్వహించడం, ఈ-కామర్స్‌ సేవలు, ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ ప్రచారం వంటివి నిర్వహించవచ్చు. 

ఫేస్‌బుక్‌ కూడా ఇటీవలే తన మాతృసంస్థ పేరును మెటాగా మార్చుకొన్న విషయం తెలిసిందే. ఈ సంస్థ కూడా మెటావర్స్‌ సాంకేతిక ఆధారంగా భవిష్యత్తులో పనిచేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే 50 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టి ఐరోపాలో 10,000 మంది ఉద్యోగులను నియమించుకొంది. మెటావర్స్‌ అభివృద్ధిలో భాగంగా 2021 లాభాల్లో 10 బిలియన్‌ డాలర్లను కోల్పోయే అవకాశం ఉందని ఫేస్‌బుక్‌ పేర్కొంది.

కొత్త మెటావర్స్‌ వ్యాపారం ఎప్పటికి లాభాల్లోకి వెళుతుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. వచ్చే పదేళ్లలో మాత్రం ఇది 100 కోట్ల మందికి చేరువవుతుందని చెబుతున్నారు. వందల కోట్ల డాలర్ల డిజిటల్‌ వాణిజ్యంతో పాటు.. క్రియేటర్లు, డెవలపర్ల రూపంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని