Beirut Explosion: బీరుట్‌లో నిరసనకారులపై కాల్పులు.. ఆరుగురి మృతి!

గతేడాది ఆగస్టులో లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో అత్యంత తీవ్రమైన పేలుడు ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 190కి పైగా మృతి చెందారు. మరో 6500 మంది గాయాలపాలయ్యారు. నగరంలోని ఓడరేవు గోదాంలో నిల్వ ఉంచిన 2700 టన్నుల అమ్మోనియం...

Published : 15 Oct 2021 01:32 IST

బీరుట్‌: గతేడాది ఆగస్టులో లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో అత్యంత తీవ్రమైన పేలుడు ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 190కి పైగా మృతి చెందారు. మరో 6500 మంది గాయాలపాలయ్యారు. నగరంలోని ఓడరేవు గోదాంలో నిల్వ ఉంచిన 2700 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ ఈ పేలుళ్లకు కారణమని అధికారులు తేల్చారు. మరోవైపు ఈ ఘటనపై న్యాయ విచారణ ప్రక్రియ స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ‘ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి తారేక్‌ బితార్‌ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆయన్ను తొలగించాల’ని హిజ్బుల్లా, అమల్ మూవ్‌మెంట్స్‌ పార్టీల మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం బీరుట్‌ జస్టిస్‌ ప్యాలెస్‌ వద్ద నిర్వహించిన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. వారిని చెదరగొట్టేందుకు గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన గ్రెనేడ్‌ దాడులు, స్నైపర్‌ కాల్పుల్లో ఆరుగురు మరణించారు. 30 మందికి పైగా గాయపడ్డారు. దీంతో స్థానికంగా పరిస్థితులు భీతావహంగా మారాయి.

న్యాయమూర్తిని తొలగించాలంటూ..

కేసు న్యాయ విచారణ ప్రక్రియపై హిజ్బుల్లా పార్టీ జనరల్ సెక్రెటరీ హసన్ నస్రల్లా.. ఇటీవల న్యాయమూర్తి బితార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. నేతలను రాజకీయంగా లక్ష్యం చేసుకున్నారని ఆరోపించారు. అంతకుముందు సదరు న్యాయమూర్తిని మార్చాలంటూ మాజీ మంత్రులు, అమల్‌ మూవ్‌మెంట్‌కు చెందిన అలీ హసన్ ఖలీల్, ఘాజీ జైటర్ చేసిన విజ్ఞప్తినీ న్యాయస్థానం తిరస్కరించింది. ఈ క్రమంలో నిరసనలు మొదలయ్యాయి. మరోవైపు దేశ అధ్యక్షుడు మిషెల్‌ ఔన్‌, ప్రధాని నజీబ్‌ మికటి.. జడ్జి బితార్‌కి మద్దతుగా నిలిచారు. ఇప్పటికే ఒక న్యాయమూర్తిని తొలగించామని, ఇప్పుడు మరొకరిని తొలగించబోమని స్పష్టం చేశారు. తాజా ఘటనపై స్పందిస్తూ.. అందరూ సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. మరోవైపు సైన్యం.. కాల్పులు జరిపినవారిని పట్టుకునేందుకు యత్నిస్తోంది. ఘటనాస్థలాన్ని ఖాళీ చేయమని పౌరులకు సూచించింది. ఇకపై ఎవరైనా కాల్పులు జరిపితే.. వారిని కాల్చివేస్తామని హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని