Narayan Rane: అందుకే నన్ను అరెస్టు చేయించారు: కేంద్ర మంత్రి

రాష్ట్రంలో చేపడుతున్న జన ఆశీర్వాద్‌ యాత్రకు భంగం కలిగించడానికే శివసేన పార్టీ తనను అరెస్టు చేయించిందని కేంద్ర మంత్రి నారాయణ రాణే తెలిపారు.

Published : 29 Aug 2021 18:17 IST

సింధ్‌దుర్గ్‌: రాష్ట్రంలో చేపడుతున్న జన ఆశీర్వాద్‌ యాత్రకు భంగం కలిగించడానికే శివసేన పార్టీ తనను అరెస్టు చేయించిందని కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణే తెలిపారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని ప్రోత్సహిస్తూ శివసేన ఉన్నత పదవులు కట్టబెడుతోందని ఆరోపించారు. జన ఆశీర్వాద్‌ యాత్ర పదో రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘జన ఆశీర్వాద్‌ యాత్రలో ఒక చెడ్డ శకునం. తమను తాము రాష్ట్రపతిగా ఊహించుకొనే కొందరు మంత్రులు నన్ను అరెస్టు చేయాలని ఆదేశించారు. వారు నా యాత్రను ఆపాలనుకున్నారు. నాకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని ప్రోత్సహిస్తూ శివసేన వారికి అధికారాలు కట్టబెడుతోంది’ అని రాణే అన్నారు.

‘నా యాత్రను కొనసాగిస్తా. మహారాష్ట్రలోని ప్రతి ఒక్క జిల్లాలో పర్యటిస్తా. కేంద్రం అందించే పథకాలను ప్రజలకు వివరిస్తా.  భాజపాలో చేరాలనుకునే వారిని స్వాగతించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటా’అని మంత్రి తెలిపారు.

‘దేశ ప్రధాని ఆలోచన నుంచి పుట్టిందే జన ఆశీర్వాద్‌ యాత్ర. ఆయన నాకు కేబినేట్‌ పదవిని ఇచ్చి ప్రజల ఆశీర్వాదం తీసుకోమన్నారు. ముంబయి నుంచి చేపట్టిన యాత్ర పదో రోజు కొనసాగుతోంది. ఈ రోజు సింధుదుర్గ్‌లో ఉన్నా. ఇప్పటికీ కొంతమంది ఈ యాత్రను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయినా కొన్ని వేల మంది జనం నాతో కలిసి వస్తున్నారు’ అని రాణే పేర్కొన్నారు. కాగా, సీఎంకు స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయిందో కూడా తెలియదని, అలాంటి వ్యక్తి చెంప పగలగొట్టాలని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. ఈ వ్యాఖ్యలకుగానూ రత్నగిరి పర్యటనలో ఉన్న ఆయనను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని