Flights: ఆ విమానాల్లో మళ్లీ భోజన సదుపాయం..!

రెండు గంటలు అంతకంటే తక్కువ సమయం ప్రయాణించే విమానాల్లో భోజన సేవలను పునరుద్ధరించొచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ.. పౌర విమానయాన శాఖకు తెలిపింది.

Published : 13 Nov 2021 17:15 IST

సేవలను పునరుద్ధరించుకోవచ్చని తెలిపిన ఆరోగ్యశాఖ

దిల్లీ: రెండు గంటలు అంతకంటే తక్కువ సమయం ప్రయాణించే విమానాల్లో భోజన సేవలను పునరుద్ధరించొచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ.. పౌర విమానయాన శాఖకు తెలిపింది. అంతేగాక, ఇకపై విమాన సిబ్బంది పీపీఈ కిట్లు ధరించాల్సిన అవసరం లేదని, అయితే గ్లౌజులు, మాస్క్‌లు, ఫేస్‌షీల్డ్‌లు మాత్రం పెట్టుకోవాల్సిందేనని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. దీంతో తక్కువ దూరం ప్రయాణించే విమానాల్లో త్వరలోనే మళ్లీ భోజన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. 

కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో గతేడాది కేంద్రం దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మే 25, 2020 నుంచి దశల వారీగా ఈ సేవలను పునరుద్ధరించింది. తొలుత భోజన సేవలను అనుమతించని కేంద్రం.. గతేడాది ఆగస్టు తర్వాత కొన్ని షరతులతో భోజన సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో కొవిడ్‌ రెండో దశ విజృంభణ నేపథ్యంలో ఈ సేవలపై మళ్లీ ఆంక్షలు విధించారు. ఏప్రిల్‌ 15 నుంచి రెండు గంటల కంటే తక్కువ సమయం ప్రయాణించే విమానాల్లో భోజన సేవలపై నిషేధం విధించారు.

అయితే ఇటీవల దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ మార్గదర్శకాలను సవరించాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ భావించింది. ఇందుకోసం ఆరోగ్యశాఖ సూచనలు కోరింది. ఈ మేరకు రెండు గంటలు కంటే తక్కువ సమయం ప్రయాణించే విమానాల్లో భోజన సేవలు మొదలుపెట్టొచ్చని ఆరోగ్యశాఖ తెలిపింది. త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని