Kerala: కరోనా ఉద్ధృతి.. కేరళలో 11వ తరగతి పరీక్షలపై సుప్రీం స్టే

కేరళలో కరోనా ఉద్ధృతి ఆందోళనకర రీతిలో ఉండటంతో అక్కడ వచ్చేవారం నుంచి జరగబోయే 11వ తరగతి పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

Published : 03 Sep 2021 16:30 IST

దిల్లీ: కేరళలో కరోనా ఉద్ధృతి ఆందోళనకర రీతిలో ఉండటంతో అక్కడ వచ్చేవారం నుంచి జరగబోయే 11వ తరగతి పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులను ప్రమాదంలో పెట్టడం సరికాదని అభిప్రాయపడింది. 

కేరళలో సెప్టెంబరు 6 నుంచి 11వ తరగతి పరీక్షలు నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా విజృంభణ ఎక్కువగా ఉండటంతో పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం.. కేరళ ప్రభుత్వ నిర్ణయంపై మధ్యంతర స్టే విధించింది. ‘‘రాష్ట్రంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రోజుకు దాదాపు 35వేల వరకూ కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 70శాతం అక్కడే ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వయసు పిల్లలను(విద్యార్థులనుద్దేశిస్తూ) ప్రమాదం బారిన పడేయలేం’’ అని ధర్మాసనం తెలిపింది. దీనిపై తదుపరి విచారణను సెప్టెంబరు 13వ తేదీకి వాయిదా వేసింది. 

కరోనా విజృంభన నుంచి కేరళ ఇంకా బయటపడట్లేదు. గురువారం అక్కడ 32వేల కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులు ఎక్కువగా ఉండటంతో ఆ రాష్ట్రంలో క్రియాశీల కేసులు కూడా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా లక్షకు పైన యాక్టివ్‌ కేసులున్న ఒకే ఒక్క రాష్ట్రం కేరళనే కావడం గమనార్హం. కొవిడ్ వ్యాప్తి పెరగడంతో ఇటీవల అక్కడ మళ్లీ రాత్రి కర్ఫ్యూ విధించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని