SC: ప్యానెల్‌ ముందు ఫేస్‌బుక్ హాజరుకావాల్సిందే..

దేశ రాజధాని నగరం దిల్లీలో జరిగిన అల్లర్ల కేసుకు సంబంధించి సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్‌బుక్‌ దిల్లీ అసెంబ్లీ ప్యానెల్ ముందు హాజరుకావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్యానెల్ జారీ చేసిన సమన్లకు వ్యతిరేకంగా ఫేస్‌బుక్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వ చట్టాల పరిధిలోకి చొచ్చుకుపోకుండా శాంతిభద్రతల అంశంపై విచారించే హక్కు ప్యానెల్‌కు ఉందని స్పష్టం చేసింది. 

Published : 09 Jul 2021 01:23 IST

దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీలో జరిగిన అల్లర్ల కేసుకు సంబంధించి సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్‌బుక్‌ దిల్లీ అసెంబ్లీ ప్యానెల్ ముందు హాజరుకావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్యానెల్ జారీ చేసిన సమన్లకు వ్యతిరేకంగా ఫేస్‌బుక్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వ చట్టాల పరిధిలోకి చొచ్చుకుపోకుండా శాంతిభద్రతల అంశంపై విచారించే హక్కు ప్యానెల్‌కు ఉందని స్పష్టం చేసింది. 

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) విషయంలో గతేడాది ఫిబ్రవరిలో దిల్లీలో అల్లర్లు చోటుచేసుకున్నాయి. మూడు రోజుల పాటు అల్లర్లు జరిగి దాదాపు 50 మందికి పైగా మరణించారు. దీనిపై దిల్లీ అసెంబ్లీకి చెందిన శాంతిభద్రతల కమిటీ విచారణ నిమిత్తం ఫేస్‌బుక్ ఉపాధ్యక్షుడు అజిత్‌ మోహన్‌కు సమన్లు ఇచ్చింది. ప్యానెల్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. దీనిపై మోహన్‌ సుప్రీంను ఆశ్రయించారు. ప్యానెల్ ముందు హాజరు కావాలని తనను బలవంతం చేయలేరని వాదించిన ఆయన..దిల్లీ శాంతి భద్రతల అంశం కేంద్రం పరిధిలోకి వస్తుందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఆ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం.. ఆయన్ను ప్యానెల్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. 

‘కేంద్ర చట్టాల పరిధిలోకి చొచ్చుకుపోకుండా శాంతిభద్రతలకు సంబంధించిన సమాచారాన్ని కోరే హక్కు దిల్లీ ప్యానెల్‌కు ఉంది. అలాగే సమాధానాలివ్వాలంటూ ఫేస్‌బుక్‌ను బలవంతం చేయలేం’ అని సుప్రీం పేర్కొంది. అలాగే  ప్యానెల్‌ ఈ కేసుపై విచారణ మాత్రమే జరపగలదని స్పష్టం చేసింది. ఫేస్‌బుక్ వేసిన పిటిషన్‌ విచారణలో భాగంగా సామాజిక మాధ్యమాల పాత్రపై సుప్రీం కొన్ని వ్యాఖ్యలు చేసింది. ‘సామాజిక మాధ్యమ సంస్థలకు ప్రజల్ని ప్రభావితం చేసే సామర్థ్యం ఉంది. ఈ వేదికపై జరిగే చర్చలకు సమాజాన్ని వర్గాలుగా విడగొట్టే శక్తి ఉంది. సరైన సమాచారం అందుబాటులో లేని వ్యక్తులు..వాటినే వార్తగా భావించే అవకాశం లేకపోలేదు’ అని వ్యాఖ్యానించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని