Param Bir Singh: భారత్‌లోనే పరంబీర్‌ సింగ్‌.. అరెస్టు నుంచి రక్షణ కల్పించిన సుప్రీం

బలవంతపు వసూళ్ల కేసులో ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు

Updated : 22 Nov 2021 16:34 IST

దిల్లీ: బలవంతపు వసూళ్ల కేసులో ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. అదే సమయంలో కేసుల దర్యాప్తునకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయనను ఆదేశించింది. 

బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పరంబీర్‌ సింగ్‌ గత కొన్ని నెలలుగా కన్పించకుండా పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన దేశం విడిచి పారిపోయారనే ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. తనపై నమోదైన కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గతవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. ముందు ఆయన ఎక్కడున్నారో చెప్పాలని పరంబీర్‌ న్యాయవాదిని ఆదేశించింది. ఆ తర్వాతే పిటిషన్‌పై విచారిస్తామని స్పష్టం చేసింది.

అయితే పరంబీర్‌ ఎక్కడికీ పారిపోలేదని, భారత్‌లోనే ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది సోమవారం కోర్టుకు తెలిపారు. ‘‘పరంబీర్‌ పారిపోవాలనుకోవడం లేదు. ఆయన ఎక్కడికీ వెళ్లలేదు. దేశంలోనే ఉన్నారు. అయితే ఆయన మహారాష్ట్రలోకి అడుగుపెడితే ముంబయి పోలీసుల నుంచి ఆయనకు ముప్పు పొంచి ఉంది. ఆయనపై తప్పుడు కేసులు నమోదయ్యాయి. అందుకే అరెస్టు నుంచి రక్షణ కోరుతున్నాం. 48 గంటల్లో సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు’’ అని పరంబీర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. 

ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు.. పరంబీర్‌కు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. అయితే తప్పనిసరిగా దర్యాప్తునకు హాజరుకావాలని ఆదేశించింది. దీంతో పాటు ఆయన పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను డిసెంబరు 6వ తేదీకి వాయిదా వేసింది. 

రూ.15కోట్ల కోసం పరంబీర్‌, మరో ఐదుగురు పోలీసులు తనను వేధించారంటూ ఈ ఏడాది జులైలో ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు ఆయనపై మరో మూడు కేసులు కూడా నమోదయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన ముంబయి పోలీసులు పరంబీర్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేశారు. అయితే, అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చివరిసారిగా మే నెలలో తన కార్యాలయంలో విధులకు వచ్చిన పరంబీర్‌.. ఆ తర్వాత నుంచి కనిపించలేదు. ఇదిలా ఉండగా.. పరంబీర్‌ను పరారీలో ఉన్న నేరస్థుడిగా బాంబే మెజిస్ట్రేట్‌ కోర్టు ఇటీవల ప్రకటించింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని