అప్పుల ఊబిలో ఉన్న పాక్​కు సౌదీ భారీ సాయం

పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్​కు సౌదీ అరేబియా భారీ సాయం అందించనుంది.....

Updated : 28 Oct 2021 10:46 IST

ఇస్లామాబాద్‌: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్​కు సౌదీ అరేబియా భారీ సాయం అందించనుంది. 4.2 బిలియన్ డాలర్లు సమకూర్చేందుకు అంగీకరించింది. ఈ వారం సౌదీలో పర్యటించిన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌.. ఆ దేశ యువరాజు మహ్మద్ బిన్​ సల్మాన్​తో చర్చలు జరిపిన మూడు రోజుల అనంతరం ఈ ప్రకటన వెలువడింది. సాయంలో భాగంగా పాకిస్థాన్ కేంద్ర బ్యాంకులో 3 బిలియన్ డాలర్లను సౌదీ డిపాజిట్ చేయనుంది. మరో 1.2 బిలియన్​ డాలర్లను ఈ ఏడాది రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తులకు ఫైనాన్స్ చేయనుంది.

సౌదీ సాయంతో ఆర్థిక సంక్షోభం లోంచి పాక్‌ కొద్దిమేర బయటపడే అవకాశాలున్నాయి. ఈ సాయానికి గానూ సౌదీ యువరాజుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో కష్టకాలంలో ఉన్న తమ దేశాన్ని ఆదుకుంటున్నందుకు కృతజ్ఞతలంటూ ట్వీట్​ చేశారు. సౌదీ ఆర్థిక సాయంతో పాకిస్థాన్ రూపాయి కోలుకుంటుందని ఇమ్రాన్ ఆర్థిక సలహాదారు శౌకత్​ తరిణ్​ ఆశాభావం వ్యక్తం చేశారు. సౌదీ ఆర్థిక ప్యాకేజీతో అంతర్జాతీయ ద్రవ్యనిధి కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదని శౌకత్ స్పష్టం చేశారు.

గతంలో సంబంధాలు దెబ్బతినడంతో..

పాకిస్థాన్​కు 2018లోనే సౌదీ 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించింది. విదేశీ మారక నిల్వల కోసం మరో 3 బిలియన్​ డాలర్ల చమురు సాయం అందిస్తామని అప్పట్లో ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో తీసుకున్న 3 బిలియన్ డాలర్లలో 2 బిలియన్​ డాలర్లను పాక్ తిరిగి వెనక్కి ఇచ్చేసింది. ఇప్పుడు మళ్లీ ఇమ్రాన్​ ఖాన్ మూడు రోజుల సౌదీ పర్యటన అనంతరం సంబంధాలు మెరుగుపడ్డాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని