Sabarimala: ఉప్పొంగిన పంబా నది.. శబరిమల యాత్ర నిలిపివేత

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని సీమ జిల్లాలతో పాటు

Published : 20 Nov 2021 11:02 IST

తిరువనంతపురం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని సీమ జిల్లాలతో పాటు తమిళనాడు, కేరళలో గత కొద్ది రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు జలప్రళయాన్ని సృష్టిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల కారణంగా కేరళలోని పంబా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో పవిత్ర శబరిమల యాత్రను అధికారులు నిలిపివేశారు. 

‘‘పతనంథిట్ట జిల్లాలో ఎడతెరపిలేని వర్షం కారణంగా పంబా నదిలో నీటి ఉద్ధృతి పెరిగింది. దీంతో కక్కి-అనథోడ్‌ రిజర్వాయర్‌, పంబా డ్యామ్‌లో వరద ప్రమాదకరస్థాయికి చేరడంతో గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాత్రికుల భద్రత దృష్ట్యా పంబ, శబరిమల యాత్రను శనివారం నిలిపివేస్తున్నాం’’ అని ఆ జిల్లా కలెక్టర్‌ దివ్య ఎస్‌ అయ్యర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వాతావరణ పరిస్థితులు దృష్ట్యా భక్తులు యాత్రను చేపట్టొద్దని అధికారులు అభ్యర్థిస్తున్నారు.

చెన్నైలోనూ వర్షాలు..

తమిళనాడు రాష్ట్రంపైనా అల్పపీడన ప్రభావం విపరీతంగా ఉంది. వెల్లూరు, తిరువల్లూరు, ఎన్నూర్‌ జిల్లాలో భారీ వర్షాల కారణంగా నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో సమీప గ్రామాలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. చెన్నైలోనూ నవంబరు 23 వరకు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కర్ణాటకలో తీర ప్రాంతాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని