అత్యవసర అనుమతిపై నిర్ణయం తీసుకోలేదు

కొవిడ్‌-19 మహమ్మారి అంతానికి రూపొందిస్తున్న వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.....

Published : 11 Oct 2020 22:27 IST

దిల్లీ: కొవిడ్‌-19 మహమ్మారి అంతానికి రూపొందిస్తున్న వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం దేశీయంగా రూపొందించిన ఫెలుడా టెస్ట్‌ను రాబోయే కొన్ని వారాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. సోషల్‌మీడియాలో ఆదివారం నిర్వహించిన ‘సండే సంవాద్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

దేశంలో ప్రస్తుతం వ్యాక్సిన్లు.. 1, 2, 3 మానవ ప్రయోగ దశల్లో ఉన్నాయని హర్షవర్ధన్‌ తెలిపారు. వీటిని అత్యవసరంగా వినియోగించడానికి అనుమతివ్వాలంటే వ్యాక్సిన్‌ భద్రత, సమర్థతకు సంబంధించిన డేటా అవసరమన్నారు. ఆ డేటా అందాక తదుపరి నిర్ణయం తీసుకోవచ్చన్నారు. ఆర్థిక అవసరాల రీత్యా కరోనా వ్యాక్సిన్‌ విషయంలో ఉద్యోగస్థులు, యువతకు పెద్దపీట వేస్తున్నారన్న ఆరోపణలను కొట్టిపారేశారు. భారత్‌ వంటి పెద్ద దేశాల్లో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ అనేది సవాల్‌తో కూడుకున్న వ్యవహారమని హర్షవర్ధన్‌ చెప్పారు. క్షేత్రస్థాయి వరకు వ్యాక్సిన్‌ను తీసుకెళ్లడం అంత సాధారణ విషయం కాదన్నారు. దేశం మొత్తం అవసరాలను ఒకే కంపెనీ లేదా ఒకే వ్యాక్సిన్‌ తీర్చలేదని చెప్పారు. అందుకే వివిధ రకాల వ్యాక్సిన్లను తీసుకొచ్చే అంశంపై చర్చిస్తున్నామని చెప్పారు.

మరోవైపు దేశీయంగా తక్కువ ఖర్చుతో కరోనా పరీక్షలు నిర్వహించగలిగే ఫెలుడా టెస్ట్‌ రానున్న కొన్ని వారాల్లో అందుబాటులోకి రానుందని హర్షవర్ధన్‌ చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఆర్‌టీ-పీసీఆర్‌తో సమానంగా ఈ ఫెలుడా టెస్ట్‌ పనిచేస్తోందని చెప్పారు. సీఎస్‌ఐఆర్‌- ఐజీఐబీ సంయుక్తంగా రూపొందించిన ఫెలుడా పేపర్‌ స్ట్రిప్‌ టెస్ట్‌కు ఇప్పటికే డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఆమోదం తెలిపిందన్నారు. సరిగ్గా ఎప్పుడు అందుబాటులోకి వచ్చేదీ చెప్పలేమన్నారు. కరోనా మళ్లీ తిరగబెడుతోందన్న వార్తలపైనా హర్షవర్ధన్‌ స్పందించారు. దీనిపై ఐసీఎంఆర్‌ అధ్యయనం చేస్తోందని, రెండు వారాల్లో సంబంధిత సమాచారాన్ని పంచుకుంటామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని