UttarPradesh: రిక్షావాలా పాన్‌కార్డుతో.. రూ.43కోట్ల వ్యాపారం..!

అతడో రిక్షావాలా. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. అలాంటి వ్యక్తికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. అది కూడా ఏకంగా రూ.3.47 కోట్ల పన్ను చెల్లించమని.

Updated : 25 Oct 2021 11:05 IST

రూ.3కోట్ల పన్నునోటీసులు మాత్రం పేదోడికి

మథుర: అతడో రిక్షావాలా. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. అలాంటి వ్యక్తికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. అది కూడా ఏకంగా రూ.3.47 కోట్ల మేరకు పన్ను చెల్లించమని..! దీంతో కంగుతిన్న ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

మథురలోని బకల్‌పూర్‌ ప్రాంతానికి చెందిన ప్రతాప్‌ సింగ్‌ది పేద కుటుంబం. రిక్షా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వచ్చే ఆదాయంలో ఖర్చులు పోగా కొంతమొత్తాన్ని బ్యాంకులో పొదుపు చేసుకుంటున్నాడు. అయితే, తన ఖాతాకు పాన్ కార్డ్‌ అనుసంధానం చేయాలని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఈ ఏడాది మార్చి 15న పాన్‌కార్డ్‌ కోసం స్థానిక జన్‌ సువిధ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు సంజయ్‌ సింగ్‌ అనే ఓ వ్యక్తి ప్రతాప్‌కు పాన్‌కార్డ్‌ కలర్డ్‌ జిరాక్స్‌ కాపీ ఇచ్చాడు. అయితే నిరక్షరాస్యుడైన ప్రతాప్‌ ఈ నకిలీ కార్డును గుర్తించలేకపోయాడు. 

ఇదిలా ఉండగా.. అక్టోబరు 19న ప్రతాప్‌కు ఐటీ అధికారుల నుంచి ఫోన్‌ వచ్చింది. రూ.3.47కోట్ల పన్ను చెల్లించాలని చెప్పి నోటీసులు కూడా జారీ చేశారు. ఇది విన్న అతడు ఒక్కసారిగా కంగారుపడిపోయాడు. తాను కేవలం రిక్షా నడుపుకునే వ్యక్తినని చెప్పాడు. దీంతో ఈసారి అధికారులు ఆశ్చర్యపోయారు. ఎవరో తన పేరుతో జీఎస్‌టీ నంబరు తీసుకుని వ్యాపారం చేస్తున్నారని, 2018-19లో ఆ కంపెనీ టర్నోవర్‌ రూ.43కోట్లుగా ఉందని అధికారులు గుర్తించారు. ఐటీ అధికారుల సలహా మేరకు ప్రతాప్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని