Republic Day: గణతంత్ర వేడుకలల్లో 1000 డ్రోన్లతో ప్రదర్శన

గణతంత్ర వేడుకల్లో భాగంగా దిల్లీలో నిర్వహించే బీటింగ్ రిట్రీట్​లో ఈసారి 1000 డ్రోన్లతో ప్రదర్శన ఉండనుంది. ఐఐటీ దిల్లీకి చెందిన ‘బోట్‌ల్యాబ్‌ డైనమిక్స్‌’ అనే అంకుర సంస్థ......

Updated : 23 Jan 2024 16:23 IST

దిల్లీ: గణతంత్ర వేడుకల్లో భాగంగా దిల్లీలో నిర్వహించే బీటింగ్ రిట్రీట్​లో ఈసారి 1000 డ్రోన్లతో ప్రదర్శన ఉండనుంది. ఐఐటీ దిల్లీకి చెందిన ‘బోట్‌ల్యాబ్‌ డైనమిక్స్‌’ అనే అంకుర సంస్థ దీన్ని నిర్వహించనుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాల ఇతివృత్తంగా ఈ ప్రదర్శనను రూపొందిస్తున్నారు.

అంతేకాకుండా తొలిసారి నార్త్ బ్లాక్​, సౌత్ బ్లాక్​ గోడలపై లేజర్ షో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బీటింగ్ రీట్రీట్‌లో డ్రోన్ల ప్రదర్శన, లేజర్​ షో ఉండటం ఇదే మొట్టమొదటి సారి అని పేర్కొన్నారు. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రమే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డ్రోన్లతో ప్రదర్శన నిర్వహించాయి. ఇప్పుడు ఆ జాబితాలో చేరే నాలుగో దేశంగా భారత్ నిలువనుంది. గణతంత్ర దినోత్సవ వేడుకలను జనవరి 23 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

శకటాలపై రాజకీయ దుమారం..

గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించే శకటాలపై ఈసారి రాజకీయ దుమారం చెలరేగింది. తమ శకటాలను ప్రదర్శించాలని పశ్చిమ బెంగాల్​, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు చేసిన విజ్ఞప్తిని రక్షణ శాఖ తిరస్కరించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్​లు ప్రధానిని కోరినప్పటికీ.. నిర్ణయంలో ఎలాంటి మార్పూ ఉండదని అధికార వర్గాలు తెలిపాయి. బెంగాల్ శకటాన్ని 2016, 2017, 2019, 2021 గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించామని, ఈ సారి 12 రాష్ట్రాలకే ఆ అవకాశం కల్పిస్తున్నామని రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్.. మమతా బెనర్జీకి లేఖ ద్వారా సమాధానమిచ్చారు. ఇదే తరహాలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​ కూడా రాజ్‌నాథ్‌ లేఖ పంపారు​.

ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 9 కేంద్ర శాఖలకు చెందిన శకటాలను మాత్రమే ప్రదర్శిస్తున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌, హరియాణా, గోవా, గుజరాత్‌, మహారాష్ట్ర సహా 12 రాష్ట్రాలు తమ రాష్ట్ర ప్రత్యేకతలకు సంబంధించిన శకటాలు ప్రదర్శిస్తాయి.  తెలుగు రాష్ట్రాల శకటాల ప్రదర్శనకు ఈ సారి కూడా అవకాశం లభించలేదు. విద్యా-నైపుణ్యాభివృద్ధి, విమానయానం, తపాలా, హోం, జలశక్తి, సాంస్కృతిక శాఖల శకటాలకు అవకాశం ఇస్తున్నట్లు రక్షణశాఖ పేర్కొంది. మొత్తం 56 శకటాలకు ప్రతిపాదనలు రాగా.. 21 శకటాలను ఖరారు చేసినట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని