2020లో బరితెగించిన పాక్!

18 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా సరిహద్దుల వద్ద ఈ ఏడాది పాకిస్థాన్‌ సైన్యం దుశ్చర్యలు తారస్థాయికి చేరాయి. 2020లో ఏకంగా 5,100 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిన పాకిస్థాన్‌.. 36 మందిని బలిగొంది.......

Updated : 30 Dec 2020 13:28 IST

దిల్లీ: 18 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా సరిహద్దుల వద్ద ఈ ఏడాది పాకిస్థాన్‌ సైన్యం దుశ్చర్యలు తారస్థాయికి చేరాయి. 2020లో ఏకంగా 5,100 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిన పాకిస్థాన్‌.. 36 మందిని బలిగొంది. మరో 136 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాయాది సైన్యం దుశ్చర్యల నుంచి సరిహద్దు గ్రామాల ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం 14వేలకుపైగా బంకర్లను నిర్మిస్తోంది. మరోవైపు పాక్‌ కవ్వింపు చర్యలకు భారత దళాలు ఎప్పటికప్పుడూ సమర్థంగా తిప్పికొట్టాయి.

సరిహద్దు గ్రామాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్‌ సైన్యం కాల్పులకు తెగబడుతోందని భారత సైనికాధికారులు వెల్లడించారు. దీంతో ఇటు సైన్యంతో పాటు సాధారణ పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. 2002లో పాక్‌ ఏకంగా 8,376 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. ఆ తర్వాత ఈ ఏడాది అత్యధిక సార్లు ఉల్లంఘనలకు పాల్పడింది. గత ఏడాది 3,289 సార్లు ఒప్పందాన్ని ఉల్లంఘించింది. వాజ్‌పేయీ హయాంలో 2003, నవంబర 26వ తేదీన భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2004, 2005, 2006లో సరిహద్దుల వద్ద శాంతియుత వాతావరణం కనిపించింది. 2009 నుంచి పాక్‌ వైపు నుంచి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలు క్రమంగా పెరుగుతున్నాయి.

పాక్‌ దుశ్చర్యల నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజల్ని రక్షించేందుకు నియంత్రణా రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వద్ద రూ.415 కోట్లతో 14,400 బంకర్ల నిర్మాణం చేపట్టింది. రజౌరీ, పూంఛ్‌, కథువా, సాంబ, జమ్మూ జిల్లాల్లో ఇలాంటి 7,777 బంకర్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. మిగిలిన వాటిని త్వరలోనే పూర్తి చేయనుంది. భారత్‌-పాక్‌ మధ్య 3,323 కి.మీ మేర సరిహద్దు విస్తరించి ఉంది. ఇందులో 221 కి.మీ మేర అంతర్జాతీయ సరిహద్దు, 740 కి.మీ మేర నియంత్రణా రేఖ జమ్మూకశ్మీర్‌ పరిధిలోకి వస్తుంది.

ఇవీ చదవండి..

పాక్‌ను ఇప్పుడేమనాలి

వింగూలూంగ్‌.. తొంగిచూస్తే కూల్చేస్తాం..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని