విద్యార్థుల ‘మన్‌ కీ బాత్‌’ వినాలి

కేంద్ర ప్రభుత్వం జేఈఈ, నీట్‌ విద్యార్థుల అభ్యర్థనలను వినాల్సిందిగా కాంగ్రెస్‌ ప్రధాన నేత..

Published : 23 Aug 2020 17:15 IST

కేంద్రాన్ని కోరిన కాంగ్రెస్‌, ఆప్‌

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం జేఈఈ, నీట్‌ విద్యార్థుల అభ్యర్థనలను వినాల్సిందిగా కాంగ్రెస్‌ ప్రధాన నేత రాహుల్‌ గాంధీ, ఆప్‌ పార్టీ నేత, దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా కోరారు. కరోనా సమయంలో ప్రవేశ పరీక్షలను నిర్వహించకుండా వాయిదా వేయాల్సిందిగా కోరారు. ‘కేంద్ర ప్రభుత్వం జేఈఈ, నీట్‌ విద్యార్థుల మన్‌ కీ బాత్‌ వినాలి. వారికి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలి’ అని రాహుల్‌ గాంధీ ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా అభ్యర్థించారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని కోరారు. కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ సైతం వీరి బాటలోనే నడిచారు. పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు సోమవారం విచారించనునుంది.

జేఈఈ, నీట్‌ ప్రవేశ పరీక్షల కోసం కేంద్రం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత సంవత్సరంతో పోలిస్తే నీట్‌ పరీక్ష నిర్వహణ కోసం 50 శాతం సెంటర్లను పెంచినట్లు పేర్కొన్నాయి. కరోనాను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపాయి. జేఈఈ, నీట్‌ పరీక్షలను వాయిదా వేయాల్సిందిగా విద్యార్థులు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గతంలోనే కొట్టివేసింది. ‘విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టివేయలేం. జీవితం ఆగిపోదు. కొవిడ్‌ ఉద్ధృతి ఇంకో ఏడాది కొనసాగితే అంతకాలం పాటు వేచి చూస్తారా?’ అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. జేఈఈ (మెయిన్స్‌) సెప్టెంబర్‌ 1 నుంచి 6వ తేదీ వరకు జరగనున్నాయి. నీట్‌ పరీక్ష సెప్టెంబర్‌ 13న నిర్వహించనున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని