కరోనాతో జాగ్రత్త.. మహమ్మారిపై పోరాటం ఆపొద్దు: రాష్ట్రపతి

భారత ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవాల్సిన తరుణమిదేనని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. దేశ ప్రజలకు 73వ గణతంత్ర దినోత్సవ.....

Updated : 25 Jan 2024 12:13 IST

దిల్లీ: భారత ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవాల్సిన తరుణమిదేనని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. దేశ ప్రజలకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. బుధవారం రిపబ్లిక్‌డే వేడుకల సందర్భంగా ఈరోజు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొవిడ్‌ వంటి అదృశ్య శక్తితో పోరాటం కొనసాగించాలనీ.. ఈ మహమ్మారి కట్టడికి మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. కొవిడ్‌పై పోరులో దేశం  అసాధారణ ప్రతిభ ప్రదర్శిస్తోందన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఇతర దేశాలకు సైతం భారత్‌ సాయం చేసిందని పేర్కొన్నారు. కరోనాకు రెండు టీకాలు రూపొందించడం గర్వకారణమన్నారు. మన దేశంలో తయారైన టీకాలను ఇతర దేశాలకూ అందించిన విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రస్తావించారు. మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం ద్వారా కొవిడ్‌ వ్యాప్తిని నిరోధించాలన్నారు. కరోనా సమయంలోనూ దేశ ప్రజలు పోరాట స్ఫూర్తి చాటారన్నారు. వైద్య రంగ నిపుణులు, సిబ్బంది ప్రశంసనీయ సేవలందించారన్నారు.

ప్రజాస్వామ్యం, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం భారత గణతంత్రానికి పునాదులుగా నిలుస్తాయని రాష్ట్రపతి అన్నారు. కరోనా వైరస్‌పై నిరుపమాన దృఢ సంకల్పాన్ని చాటామని చెప్పేందుకు తాను గర్వపడుతున్నానన్నారు. కరోనా పట్ల ఇంకా అప్రమత్తంగా ఉండాలనీ.. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. తమ ప్రాణాలకు అపాయమని తెలిసినా వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది ఈ సవాల్‌ని ఎదుర్కొనేందుకు పని గంటలతో నిమిత్తం లేకుండా కష్టసమయంలో సేవలందించారని కొనియాడారు. కరోనా ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని.. కరోనా సమయంలోనూ సాగు, తయారీ రంగంలో ప్రగతి సాధించామన్నారు. సురక్షితమైన డిజిటల్‌ చెల్లింపు సదుపాయాలు మెరుగయ్యాయని తెలిపారు. యువ మానవ వనరులు ఉండటం దేశానికి అనుకూలమైన అంశమని రాష్ట్రపతి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని