భారత్‌-పాక్‌ నిర్ణయాన్ని ప్రశంసించిన ఐరాస

సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూచా తప్పకుండా పాటించేందుకు భారత్‌-పాక్‌ మధ్య కుదిరిన అంగీకారాన్ని ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందాన్ని ఐరాస అధినాయకత్వం స్వాగతిస్తున్నట్లు పేర్కొంది....

Published : 26 Feb 2021 23:08 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూచా తప్పకుండా పాటించేందుకు భారత్‌-పాక్‌ మధ్య కుదిరిన అంగీకారాన్ని ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందాన్ని ఐరాస అధినాయకత్వం స్వాగతిస్తున్నట్లు పేర్కొంది. కాల్పుల విరమణపై భారత్‌, పాక్‌ సైన్యం చేసిన సంయుక్త ప్రకటన కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ప్రశాంత వాతావరణానికి దోహదం చేస్తుందని ఐరాస అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డొజారిక్‌ తెలిపారు. ఇరు దేశాల తదుపరి చర్చలకు ఇదొక సానుకూల పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత్‌-పాక్‌ మధ్య కుదిరిన అంగీకారాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి 75వ సెషన్‌ అధ్యక్షుడు వొల్కాన్‌ బోజ్కిర్‌ వెల్లడించారు. ప్రధాన సమస్యలు, ఆందోళనలను పరిష్కరించడం ద్వారా సుస్థిర శాంతిని సాధించవచ్చని చెప్పేందుకు ఇది ఉదాహరణగా నిలుస్తుందని ట్విటర్‌లో పేర్కొన్నారు. గురువారం భారత్‌, పాక్‌ డైరెక్టర్‌ జనరళ్ల స్థాయి సమావేశంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని తప్పనిసరిగా పాటించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని