Published : 03/06/2021 01:36 IST

కరోనా దెబ్బకు.. ఆ దేశాల మంత్రులు రాజీనామా!

వైరస్‌ కట్టడిలో విఫలమైనందుకు బాధ్యులుగా..

ఇంటర్నెట్‌ డెస్క్‌: యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆయా దేశాలు శ్రమిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని దేశాల్లో వైరస్‌ ఉద్ధృతిని నియంత్రించేందుకు అక్కడి ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోలేదనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ కట్టడిలో విఫలమైన ఆరోపణలతో కొన్ని దేశాల ఆరోగ్యశాఖ మంత్రులు వారి పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బ్రెజిల్‌లో నలుగురు..

వైరస్‌ కట్టడికి సరైన చర్యలు చేపట్టడం లేదంటూ బ్రిజిల్‌లో భారీ సంఖ్యలో పౌరులు రోడ్లమీదకు వచ్చి ప్రధాని బొల్సొనారోకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ నాలుగు సార్లు ఆరోగ్యశాఖ మంత్రిని మార్చాల్సి వచ్చింది. బ్రెజిల్‌లోనే కాకుండా మరికొన్ని దేశాల్లోనూ కరోనా నియంత్రణలో అక్కడి ఆరోగ్యశాఖ మంత్రులు అలసత్వం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు నేపథ్యంలో వారి పదవిని వదులుకోవాల్సి వచ్చింది. వీరే కాకుండా స్కాట్‌ల్యాండ్‌, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌ దేశాల్లో కొవిడ్‌ నిబంధనలు అతిక్రమించినందుకు కీలక పదవుల్లో ఉన్న నాయకులకు ఉద్వాసన పలకాల్సి వచ్చింది.

అర్జెంటీనా..

కరోనా వైరస్‌ ధాటికి దక్షిణ అమెరికా దేశాలు వణికిపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆర్జెంటీనాలో వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు ఇక్కడ 38లక్షల పాజిటివ్‌ కేసులు రికార్డు కాగా 78 వేల మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో దేశంలో ప్రారంభమైన వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో అవకతవకలు జరిగినట్లు తేలింది. క్యూలో నిలబడకుండా కొందరు రాజకీయ పలుకుబడి ఉపయోగించారనే వార్తలు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి గైన్స్‌ గొంజాలెజ్‌ గర్సియా తన పదవిని వీడుతున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించారు.

జోర్డాన్‌..

కరోనా కరోనా తీవ్రత కొనసాగుతున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల కొవిడ్‌ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా ఏర్పడింది. దీంతో చాలా ఆసుపత్రుల్లో కొవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఇలా జోర్డాన్‌లోని ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్‌ కొరతతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఈ ఘటనపై ప్రధానమంత్రి బిషెర్‌ ఆల్‌ ఖాసవ్‌నేవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి నాజిర్‌ ఒబియదత్‌ ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ 7లక్షల కేసులు నమోదుకాగా 9వేల మంది కొవిడ్‌ బాధితులు కన్నుమూశారు.

పెరూ..

కరోనా వైరస్‌ ఉద్ధృతికి పెరూ దేశం వణికిపోయింది. అక్కడ 19 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 69వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై వివాదం మొదలయ్యింది. ఆ దేశంలో వ్యాక్సిన్‌ ప్రజలకు అందుబాటులోకి రాకముందే పెరూ మాజీ అధ్యక్షుడు మార్టిన్‌ విజ్‌కర్రా టీకా తీసుకున్నారని తేలింది. దీన్ని వ్యాక్సిన్‌ స్కాండల్‌గా పేర్కొంటూ స్థానిక మీడియా ప్రసారం చేయడంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత మొదలయ్యింది. దీంతో పెరూ ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ పిలార్‌ మజెట్టీ తన పదవికి రాజీనామా చేశారు.

ఇరాక్‌..

కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో ఇరాక్‌లోని ఓ కొవిడ్‌ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆక్సిజన్‌ ట్యాంకు పేలిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు విచారణలో తేలింది. ఇందుకు బాధ్యత వహిస్తూ ఇరాక్‌ ఆరోగ్యశాఖ మంత్రి హస్సన్‌ ఆన్‌-తమీమీ తన పదవికి రాజీనామా చేశారు. ఇక ఇరాక్‌లో ఇప్పటివరకు 12లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 16వేల కొవిడ్‌ మరణాలు నమోదయ్యాయి.

ఆస్ట్రియా..

కరోనా కట్డడికి కృషి చేసిన ఆస్ట్రియా ఆరోగ్యశాఖ మంత్రి రుడోల్ఫ్‌ ఆన్‌షోబెర్‌ కూడా ఏప్రిల్‌ 13న తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో కరోనా విజృంభణ సమయంలో అధిక సమయం పనిచేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అందుకే ఈ బాధ్యతలు నిర్వర్తించడానికి మరో దక్షత కలిగిన నాయకుడు అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని తన వైద్యులు కూడా సూచించినట్లు రుడోల్ఫ్‌ తెలిపారు. ఆస్ట్రియాలో ఇప్పటివరకు 6లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ మరణాల సంఖ్య 10వేలు దాటింది.

ఈక్వెడార్‌..

కరోనా కట్టడి, వ్యాక్సిన్‌ పంపిణీ వ్యవహారంలో సరిగా స్పందించని కారణంగా ఈక్వెడార్‌ ఆరోగ్యశాఖ మంత్రి రొడొల్ఫో ఫార్ఫాన్‌ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పదవీ బాధ్యతలు చేపట్టిన కేవలం నెల రోజుల్లోనే ఆయన ఆరోగ్యశాఖకు రాజీనామా చేశారు. ముఖ్యంగా వ్యాక్సిన్‌ సరఫరాలో తన సన్నిహితులకు సహాయం చేసినట్లు ఆరోపణలు రావడంతో రొడొల్ఫో తన పదవికి రాజీనామా చేశారు. ఈక్వెడార్‌లో ఇప్పటివరకు 4లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 20వేల మంది మృత్యువాతపడ్డారు.

మంగోలియా..

కరోనా వైరస్‌ సోకిన ఓ మహిళతో పాటు చిన్నారికి చికిత్స చేసే విషయంలో ప్రభుత్వ వైద్యులు నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలతో మంగోలియాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు దారితీసింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఈ ఘటనతో  కేబినెట్‌ మొత్తం రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ ఘటనకు తాను బాధ్యత వహించాల్సి ఉంటుందని.. అందుచేత కేబినెట్‌ మొత్తం రద్దు చేస్తున్నట్లు మంగోలియన్‌ ప్రధానమంత్రి ఖురేల్‌సుఖ్‌ ఉఖ్‌నా ప్రకటించారు. అప్పుడే జన్మనిచ్చిన తల్లిని మరోచోటుకి తరలించడంలో తప్పు జరిగిందని ప్రధాని అంగీకరించారు.

స్లొవాకియా..

కరోనా వైరస్‌ మహమ్మారిని కట్టడి చేయడంలో స్లొవాకియా ప్రభుత్వం విఫలమయ్యిందని అక్కడి విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. ముఖ్యంగా వైరస్‌ కట్టడితోపాటు రష్యా వ్యాక్సిన్‌ సుత్నిక్‌-వి విషయంలోనూ ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇలా కరోనా నియంత్రణలో విఫలం కావడంపై ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఈ ఏడాది మార్చి నెలలో స్లొవాకియా ఆరోగ్యశాఖ మంత్రి మారెక్‌ క్రాజి తన పదవికి రాజీనామా చేశారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని