Lakhimpur Kheri: లఖింపుర్‌ ఖేరి ఘటన.. ఆశిష్‌ మిశ్రాకు 3 రోజుల పోలీసు కస్టడీ

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో నిందితుడిగా అనుమానిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌

Published : 11 Oct 2021 23:30 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో నిందితుడిగా అనుమానిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాను 3 రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. దీంతో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి అక్టోబరు 15 ఉదయం 10 గంటల వరకు ఆయన పోలీసు రిమాండ్‌లో ఉండనున్నారు. 

గత శనివారం దాదాపు 12 గంటల విచారణ అనంతరం ఆశిష్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టులో హాజరుపర్చగా.. 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. అయితే ఆశిష్‌ విచారణకు సరిగా సహకరించడం లేదని, అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని పోలీసులు ఆరోపించారు. అతడిని పోలీసు రిమాండ్‌కు అప్పగించాలని కోరుతూ కోర్టుకు దరఖాస్తు సమర్పించారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం అతడిని మూడు రోజుల పాటు పోలీసుల రిమాండ్‌కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ నెల 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో నిందితుడిగా ఆశిష్‌ మిశ్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనలో నలుగురు రైతులు మృతిచెందారు. అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు మృతిచెందారు. దీంతో ఈ ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత ఆశిష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఉద్రిక్తతలు జరిగిన అక్టోబరు 3వ తేదీన తాను లఖింపుర్‌ ఖేరిలో లేనని, వేరే చోట కార్యక్రమంలో పాల్గొన్నానని ఆశిష్‌ తెలిపారు. కానీ ప్రత్యక్ష సాక్షులు మాత్రం.. రైతులు దూసుకెళ్లిన వాహనంలో మంత్రి కుమారుడు కూడా ఉన్నారని చెప్పడం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు