Chhath puja: అర్చకులు లేకుండా పూజ.. ఛఠ్‌ పండగ ప్రత్యేకత ఇదే!

సంప్రదాయం, పండుగలకు పెట్టింది పేరు మన భారతదేశం. మనం జరుపుకొనే ప్రతీ పండుగ వెనుక పురాణాలకు సంబంధించిన ఒక కథ లేదా ఓ సందర్భమనేది తప్పక ఉంటుంది. ప్రకృతితో మమేకమై జరుపుకొనే ‘ఛఠ్‌ పండుగ’

Published : 10 Nov 2021 17:44 IST

 ‘ఛఠ్‌ పూజ’ విశిష్టతను తెలియజేసిన ప్రధాని నరేంద్ర మోదీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: పండుగలకు పెట్టింది పేరు మన భారతదేశం. మనం జరుపుకొనే ప్రతి పండుగ వెనుకా పురాణాలకు సంబంధించిన ఒక కథ లేదా ఓ సందర్భమనేది తప్పక ఉంటుంది. ఆ కోవకు చెందినదే ఛఠ్‌ పండుగ. ప్రకృతితో మమేకమై జరుపుకొనే పండగ ఇది. ఛట్‌ పండుగ సందర్భంగా అసలేమిటీ పండుగ? ఎందుకు జరుపుకొంటారు? దీని ప్రాముఖ్యం ఏంటో తెలుసుకుందాం..

దీపావళి పండుగ పూర్తయిన ఆరు రోజుల తర్వాత జరుపుకొనేదే మహాపర్వ్‌ ‘ఛఠ్‌ పూజ’. ఏటా కార్తిక మాసం శుక్లపక్షంలోని షష్ఠి సందర్భంగా నాలుగు రోజుల పాటు ఈ  పూజలు చేస్తారు. సాధారణంగా పూజలు చేస్తున్నప్పుడు అర్చకులు ఉంటారు. ఇందులో అర్చకులే లేకుండా పూజలు నిర్వహించడం ఓ విశేషం. బిహార్‌, ఝార్ఖండ్‌ సహా ఉత్తర భారత దేశంలో ‘ఛఠ్‌ పూజ’ను నిర్వహిస్తారు. రోజు తినే ఆహారం నుంచి ధరించే వస్త్రాల వరకూ ఆచారాలు, సంప్రదాయాలకు అనుగుణంగా ఉంటాయి. ఉదయించే సూర్య భగవానుడిని ప్రత్యేకంగా కొలుస్తారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పండుగలో.. 36 గంటల పాటు మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం చేస్తారట. సూర్యభగవానుడిని కొలిచే ఏకైక పూజ ఇదేనని అక్కడి వారి విశ్వాసం. దీనికే సూర్యశస్తిల్, దళాఛఠ్‌ అని కూడా పేర్లున్నాయాయి. దీపావళి మాదిరిగానే ఈ పూజ సమయంలో దీపాలు వెలిగిస్తారు. నదీ ఘాట్‌ల వద్ద పండ్లతో అలంకరించి ఛఠ్‌మాతకు పూజలు చేస్తారు. అనంతరం పండ్లను పంచిపెడతారు. ఈ ఏడాది నవంబర్‌ 8న ప్రారంభమైన ఈ పూజ 11తో ముగియనుంది. సూర్యుడు, నీరే ఈ పూజలో కీలకం. ప్రార్థనల్లో వెదురు, మట్టిని ఎక్కువ ఉపయోగిస్తారు. ఇక ప్రసాదాల్లో చెరకు ప్రధానంగా కనిపిస్తుంది. మహా పర్వ సందర్భంగా చెరకు గడలతో ఇల్లు మాదిరిగా నిర్మించి అందులో ఏనుగు ప్రతిమను ఉంచి పూజలు చేస్తారు.

మోదీ శుభాకాంక్షలు
ఛఠ్‌ పూజ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ విశిష్టత గురించి ‘మన్‌కీ బాత్‌’లో మాట్లాడిన ఆడియోను ట్విటర్‌లో ఉంచారు. ప్రకృతితో ఈ పండుగ ముడిపడి ఉందని మోదీ చెప్పారు. సాధారణంగా ప్రపంచమంతా ఉదయించే సూర్యుడినే ఆరాధిస్తుందని, అస్తమించే సూర్యుడిని ఆరాధించడంలోనూ గొప్పదనం, గౌరవం ఉందనేది ఈ ఛఠ్‌ పూజ ద్వారా తెలుస్తుందని మోదీ అన్నారు. సాధారణంగా ప్రజలు వేరేవాళ్ల నుంచి ఏదైనా అడగాలంటే సంకోచిస్తారని, ఛఠ్‌ పూజ రోజు పక్కన వారి నుంచి ప్రసాదం అడిగి తీసుకునే సంప్రదాయం ఉంటుందని తెలిపారు. మనలోని అహంకారాన్ని చంపడమే దీని వెనుక ముఖ్య ఉద్దేశమని చెప్పుకొచ్చారు. ప్రతి భారతీయుడూ ఇలాంటి సంప్రదాయం పట్ల గర్వపడాలి మోదీ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని