Crop varieties: 35 ప్రత్యేక పంట రకాల ఆవిష్కరణ.. జాతికి అంకితమిచ్చిన ప్రధాని

వ్యవసాయ రంగంలో సాంకేతికత, ప్రభుత్వాలు, సమాజం.. ఈ మూడు కలిసి పనిచేసినప్పుడు మెరుగైన ఫలితాలు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వాతావరణ మార్పులు, పోషకాహార లోపాల సవాళ్ల పరిష్కారంలో భాగంగా భారత వ్యవసాయ పరిశోధన మండలి...

Published : 28 Sep 2021 18:25 IST

దిల్లీ: వ్యవసాయ రంగంలో సాంకేతికత, ప్రభుత్వాలు, సమాజం.. ఈ మూడు కలిసి పనిచేసినప్పుడు మెరుగైన ఫలితాలు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వాతావరణ మార్పులు, పోషకాహార లోపాల సవాళ్ల పరిష్కారంలో భాగంగా భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్‌) అభివృద్ధి చేసిన 35 ప్రత్యేక పంట రకాలను ప్రధాని గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విడుదల చేసి, వాటిని జాతికి అంకితమిచ్చారు. కరవు తదితర కఠిన వాతావరణ పరిస్థితులను తట్టుకోవడంతోపాటు అధిక పోషక విలువలు కలిగిన.. వరి, గోదుమ, మొక్కజొన్న, సోయాబీన్‌ తదితర పంట రకాలు ఇందులో ఉన్నాయి. కార్యక్రమంలో భాగంగా.. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో నూతనంగా నిర్మించిన ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ స్ట్రెస్ టాలరెన్స్’ క్యాంపస్‌నూ ప్రధాని ప్రారంభించారు.

రైతుల ఆదాయం పెంచడంపై దృష్టి..

కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ఆయా వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు గ్రీన్‌ క్యాంపస్‌ అవార్డులు అందజేశారు. సాగులో వినూత్న పద్ధతులు అవలంబిస్తున్న రైతులతోనూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రైతుల్లో 86 శాతం మంది సన్నకారు రైతులేనని, వారి ఆదాయాన్ని పెంచడంపై ప్రధాని దృష్టి సారించారన్నారు. వ్యవసాయదారులు స్వశక్తితో ఎదిగేలా, సాధికారత సాధించేలా.. పీఎం కిసాన్‌ యోజన, కిసాన్‌ రైల్‌ తదితర పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. ఛత్తీస్‌గఢ్‌లో క్యాంపస్‌ ప్రారంభోత్సవంపై రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని