ఎన్సీపీ మంత్రులతో పవార్‌ కీలక భేటీ!

మహారాష్ట్రలో ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌వీర్‌ సింగ్‌ హోంమంత్రిపై చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఎన్సీపీ నేత, హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా సంచలన ఆరోపణలు చేస్తూ పరమ్‌వీర్‌ సింగ్‌ శనివారం సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు

Published : 21 Mar 2021 13:02 IST

ముంబయి: మహారాష్ట్రలో ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌వీర్‌ సింగ్‌ హోంమంత్రిపై చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఎన్సీపీ నేత, హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా సంచలన ఆరోపణలు చేస్తూ పరమ్‌వీర్‌ సింగ్‌ శనివారం సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం ముంబయి, నాగ్‌పూర్‌ సహా పలు ప్రధాన నగరాల్లో ప్రతిపక్ష భాజపా నాయకులు హోంమంత్రికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. అనిల్‌ దేశ్‌ముఖ్‌ వెంటనే హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని భాజపా నాయకులు డిమాండ్‌ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో నాగ్‌పూర్‌లో అనిల్‌ దేశ్‌ముఖ్‌ నివాసం వద్ద పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. 

దిల్లీకి రమ్మంటూ మంత్రులకు పవార్‌ సమన్లు?
పరమ్‌వీర్‌ సింగ్‌ చేసిన ఆరోపణల విషయమై చర్చించేందుకు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ పార్టీ సీనియర్‌ మంత్రులను దిల్లీకి రమ్మన్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌, రాష్ట్ర ఎన్సీపీ చీఫ్‌ జయంత్‌ పాటిల్‌ ఈ రోజు మధ్యాహ్నం పవార్‌తో సమావేశమయ్యేందుకు దిల్లీకి బయలుదేరనున్నారు. వారితో పాటు శివసేన నేత సంజయ్‌ రౌత్‌ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నట్లు ఆయనే స్వయంగా ఓ మీడియాతో తెలిపారు. ‘పవార్‌ సరైన నిర్ణయమే తీసుకుంటారు. నేను ఈ రోజు మధ్యాహ్నం దిల్లీ వెళ్లి ఆయన్ను కలుస్తాను’ అని రౌత్‌ చెప్పారు.

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ముంబయి మాజీ పోలీస్‌ కమిషన్‌ పరమ్‌వీర్‌ సింగ్‌ శనివారం సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నగరంలోని బార్లు, హుక్కా సెంటర్ల నుంచి నెలకు రూ.100కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారులకు హోంమంత్రి నిర్దేశించారని ఆరోపిస్తూ పరమ్‌వీర్‌ సీఎం ఠాక్రేకు లేఖ రాశారు. అంతేకాకుండా తనను ముంబయి సీపీ పదవి నుంచి ఇటీవల హోంగార్డుల కమాండెంట్‌గా బదిలీ చేయడం వెనక కారణాలనూ లేఖలో విశదీకరించారు. అయితే ఈయన ఆరోపణలను అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఖండించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని